ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాన్వాయ్‌పై దాడి

టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. గన్నేరువరం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన యువజన సంఘాలు తమకు డబుల్ లైన్ రోడ్డు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా చేస్తున్నారు. ఆదివారం ఆ ధర్నా శిబిరం మీదుగా వెళుతున్న రసమయిని నిరసనకారులు అడ్డుకునే యత్నం చేశారు. రసమయి కాన్వాయ్ ఆపకుండా ముందుకు సాగారు. తమకు సమాధానం కూడా చెప్పరా? అంటూ రసమయి కాన్వాయ్ పై దాడికి యత్నించారు. కాన్వాయ్‌ని కొంతదూరం వరకు వెంటాడారు.

ఈ ఘటన అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సుడా ఛైర్మన్(టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు) జి.వి.రామకృష్ణారావు తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో వారి వెంటనున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు స్టేషన్ లోపలున్న కాంగ్రెస్, యువజన సంఘాల నేతల దగ్గరకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.