ప్రేమ పెళ్లి..యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన హేమంత్ హత్య

Young man from hyderagad brutally murdered in Sangareddy

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో హేమంత్‌ అనే అబ్బాయిని అమ్మాయి తండ్రి హత్య చేయించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని చందానగర్‌లో హేమంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తమ ప్రాంతానికి చెందిన అవంతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో హేమంత్ దంపతులు నివాసం ఉంటున్నారు.

నిన్న సాయంత్రం హేమంత్‌తో పాటు అతడి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. ఈ క్రమంలో హేమంత్ భార్య కారులోంచి దూకేసి తప్పించుకుంది. అనంతరం హేమంత్‌ను మాత్రమే వారు తీసుకెళ్లి హత్య చేశారు. ఈ రోజు ఉదయం సంగారెడ్డిలో హేమంత్‌ విగతజీవిగా కనపడ్డాడు. ప్రస్తుతం హేమంత్ మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంది. కాగా, పెళ్లి జరిగినప్పటి నుంచి హేమంత్‌పై యువతి తండ్రి ఆగ్రహంతో ఊగిపోతున్నాడని హేమంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హేమంత్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పారు. హేమంత్ అపహరణపై గత రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని యువతి తండ్రే హత్య చేయించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/