తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మరణాలు ఆగడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే లక్షల్లో ఉద్యోగాలొస్తాయనుకున్న యువత పరిస్థితి.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే దయనీయంగా తయారైంది. రాష్ట్ర సాధన కోసం అన్నీ వదులుకుని పోరాడిన యువకులు నేడు మధ్య వయసుకు చేరి, కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో జీవితాలు సాగిస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసీ చూసీ, అన్నింటికీ ఆగమైపోతున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. పదిమందిలో తల ఎత్తుకొని తిరగలేక జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు.

రాష్ట్రం ఏర్పడి ఇన్ని ఏళ్లు అవుతున్న ఇంకా నిరుద్యోగులు..నిరుద్యోగులాగానే ఉండిపోయారు. ఆలా నిరుద్యోగులుగా ఉండలేక తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది మరణించగా..తాజాగా మంగళవారం సిద్దిపేట జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన బిర్లా శ్రీకాంత్ తన పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిరోజులుగా కానిస్టేబుల్ ఉద్యోగం కోసం హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నాడని.. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడని బంధువులు చెబుతున్నారు. తర్వాత సిద్దిపేటకు వచ్చి కానిస్టేబుల్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్నాడని.. నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.