చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన యూపీ సీఎం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న యోగి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూపీ సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. యోగి రాక సందర్భంగా ఆలయాన్ని బీజేపీ నేతలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. గతంలో మొక్కు ఉన్నందుకు సీఎం యోగీ అమ్మవారి ఆలయానికి వచ్చారని బీజేపీ నేతలు వెల్లడించారు.

యోగికి ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది. యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసులు నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల రేడియస్‌లో మూడు వలయాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. రూట్ టాప్ భద్రతను సౌత్ జోన్ పోలీసులు పటిష్టం చేశారు. మొత్తం 350మంది పోలీస్‌లతో చార్మినార్ భాగ్యలక్ష్మి లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారమే అమ్మవారి దర్శనానికి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉంది. కానీ సమయం సర్దుబాటు కాకపోవటంతో వాయిదాపడింది.