కరోనా బాధితుల కోసం సీఎం కేజ్రీవాల్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ..కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు యోగా/ప్రాణాయామంపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నట్టు ట్విటర్‌లో మంగళవారం పేర్కొన్నారు. యోగా ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకోవచ్చని చెప్పారు. యోగా క్లాసులకు సంబంధించి పాజిటివ్‌ వ్యక్తుల ఫోన్లకు నేడు ఒక లింక్‌ పంపిస్తామని బుధవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ఆన్‌లైన్‌లో క్లాసులు మొదలవుతాయని తెలిపారు.

ఇక రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు ఉధృతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కట్టడి నేపథ్యంలో కరోనా కఠిన ఆంక్షలను తీసుకొచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంది అన్న భావన వ్యక్తమైంది. అయితే ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండబోదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేసారు. ఢిల్లీలో సానుకూలత రేటు ఏడు నెలల గరిష్టంగా 25 శాతంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం నాడు దాదాపు 22,000 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో దాదాపు 20,000-22,000 కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతాయని తాము భావిస్తున్నామని, గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటు దాదాపు 24-25 శాతంగా ఉందని పేర్కొన్నారు.