తెరాస ఎమ్మెల్యే వేధిస్తున్నాడంటూ సర్పంచ్ రాజీనామా

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. భూపాల్‌రెడ్డి వేదిస్తున్నారని తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ గాదె సంధ్య తన పదవికి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కలెక్టర్‌కు అందించేందుకు వెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ ఏవో మోతీలాల్‌కు అందించడం జరిగింది.

ఎమ్మెల్యే వేధింపులు, ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేకే రాజీనామా చేసినట్టు సంధ్య తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తాను ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదని , టీఆర్ఎస్‌లో చేరకపోవడం వల్లే ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రెండున్నరేళ్లుగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాదె సంధ్య ఆరోపణలపై ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పందిస్తూ, గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం చేతకాక తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.