ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్సార్సీపీ మద్దతు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైస్సార్సీపీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారైన సంగతి తెలిసిందే. రేపు శుక్రవారం ఈమె ఉదయం పదిన్నరకు నామినేషన్ వేయబోతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ తమ మద్దతును అధికారికంగా ప్రకటించింది.

స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని ఆ పార్టీ పేర్కొంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఈ సందర్బంగా పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఉన్నందున సీఎం జగన్‌ దిల్లీకి వెళ్లడం లేదని.. శుక్రవారం జరగబోయే ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి తమ పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభాపక్ష నేత హాజరవుతారని ప్రకటించింది. ఇక ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము..ప్రధాని మోడీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్‌లో ప్రశంసించారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కూడా ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరగనున్నాయి.

ఇక ద్రౌపది ముర్ము విషయానికి వస్తే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము.. ఆదివాసీ (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన వారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. ఝార్ఖండ్ గవర్నర్​గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2015-2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్‌ శాఖల మంత్రిగా పని చేశారు.