జులై 8న వైసీపీ ప్లీనరీ

cm jagan

జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల ఫై కసరత్తులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వైస్సార్సీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మే 2 నుంచి ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. మే 10 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం, పాత మంత్రులు, జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

రానున్న రెండేళ్లలో ప్రజల్లోకి ఏవిధంగా వెళ్లడం, 170 కి తక్కువ కాకుండా ఎలా సీట్లు సాధించడం అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తున్నది. అంతే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ హెచ్చరిక కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతానని జగన్ స్పష్టం చేసారని సమాచారం. రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీంమన్నారు. గెలిస్తేనే మంత్రి పదవి అని,గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తానని జగన్ తెలిపారు. ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదని తెలిపారు.

మంత్రులు, జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్‌ సూచించారని మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరేలా నేతలంతా ప్రజల్లోనే ఉండాలని చెప్పారన్నారు. చంద్రబాబు కుయుక్తులను పార్టీపరంగా ఎదుర్కోవాలని సూచించారని తెలిపారు.