రాజమహేంద్రవరంలో మహాసేన రాజేష్ ఫై దాడి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహాసేన రాజేష్ ఫై వైస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆదివారం జనసేన నగర అధ్యక్షుడు వై. శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలకు రాజేష్ హాజరవుతున్నాడని తెలుసుకున్న వైస్సార్సీపీ కార్య కర్తలు..నందం గనిరాజు కూడలిలో కాపు కాసి.. రాజేష్ వాహనాన్ని అడ్డుకుని, దాడికి తెగబడ్డారు. రాజేష్ జనసేనకు మద్దతు ఇవ్వడాన్ని నిలదీశారు. ఇదంతా చూస్తున్న జనసేన నాయకులు రాజేష్ కారు వద్దకు చేరుకుని.. ఆయనను వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, దుండగులు ఒక్కసారిగా రాజేష్ పై దాడికి దిగారు.

పోలీసుల సమక్షంలోనే దుర్భాషలాడుతూ కారుపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. అప్రమత్తమైన పోలీసులు అతి కష్టం మీద రాజేష్ ని అక్కడి నుండి పంపించేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే తమ పార్టీ నేతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజేష్ పై దాడి చేయడం ఏమిటని జనసేన కార్య కర్తలు , నేతలు ప్రశ్నిస్తున్నారు.

దాడి అనంతరం మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. జనసేనకు మద్దతునిచ్చినప్పుడే నా ప్రాణాలకు తెగించాను. వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజూ నా ప్రాణాలను ఫణంగా పెట్టాను. నన్ను చంపిన తరువాతైనా వైస్సార్సీపీ అక్రమాలను నా జాతి తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే చాలు.. నా ప్రాణాలను తీసినా.. మాలోని ధైర్యాన్ని మాత్రం చంపలేరు’అంటూ చెప్పుకొచ్చారు.