నేడు హైదరాబాద్‌కు రానున్న యశ్వంత్‌ సిన్హా

yashwanth-sinha-visists-hyderabad-today

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా… టీఆర్ఎస్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాని సహా బీజేపీ అగ్రనేతలందరూ నేడు నగరంలోనే ఉంటున్నందున… గులాబీ దళం బల ప్రదర్శన తరహాలో సన్నాహాలు చేసింది. ఉదయం 11 గంటలకు యశ్వంత్ సిన్హా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ ముఖ్యనేతలు విమానాశ్రయానికి వెళ్లి… యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులో జలవిహార్ వరకు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.

సుమారు ఆరు వేలకు పైగా ద్విచక్రవాహనాలతో ప్రదర్శన ఉంటుందని తెరాస నేతలు వెల్లడించారు. జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస సభ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించారు. సుమారు 230 మంది సభలో పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.ఓ వైపు నగరంలో బీజేపీ సమావేశాలు… మరోవైపు జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న కేసీఆర్…. జలవిహార్ వేదికగా కీలక విషయాలను ప్రస్తావించే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత తనకు మద్దతివ్వాలని కోరుతూ యశ్వంత్ సిన్హా ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత జలవిహార్‌లోనే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేస్తారు. జలవిహార్ సమావేశానికి కేవలం టీఆర్ఎస్ నేతలే హాజరవుతారని.. యశ్వంత్ సిన్హాకు మద్దుతిస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం నాయకులెవరూ పాల్గొనబోరని పార్టీ నేతలు స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హా కు స్వాగతం, సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను నగర నేతలకు టీఆర్ఎస్ అప్పగించింది. ఏర్పాట్లు ఘనంగా చేయాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/