స్పీకర్ తమ్మినేనిపై యనమల విమర్శలు

స్పీకర్ మాటలు సభలో ఒకలా, బయట మరోలా ఉన్నాయి

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతి: వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యలపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, ఏదైనా అంశం చట్టవిరుద్ధం అయిన పక్షంలో చట్టసభల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయని, ఈ విషయాన్ని స్పీకర్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఓ సభలో ఆమోదం పొందిన చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టు దాన్ని ప్రశ్నించే వీలుందని స్పష్టం చేశారు.

రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీల వద్ద పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టుకు ఏజీ తెలిపినప్పుడు, ప్రభుత్వం ఆ బిల్లులను మరోసారి సభలోకి ఎలా తీసుకువచ్చిందని యనమల ప్రశ్నించారు. ఇది చట్టవిరుద్ధం కాబట్టే తమ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని వెల్లడించారు. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని, ఈ రెండు బిల్లులకు చెందిన శాసన ప్రక్రియ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. ఈ వివరాలను గౌరవనీయ అసెంబ్లీ స్పీకర్ తెలుసుకుంటే బాగుంటుందని యనమల పేర్కొన్నారు. స్పీకర్ మాటలు సభలో ఒకలా ఉంటే, వెలుపల మరోలా ఉంటున్నాయని విమర్శించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/