ఫొటోలతో చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారుః యనమల

జగన్ పాలన అద్భుతంగా ఉంటే జనాలు బారికేడ్లు దూకి ఎందుకు పారిపోతారని ఎద్దేవా

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతిః టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపి సర్కార్‌పై విమర్శలు మరోసారి గుప్పించారు. అబద్ధాలు, అసత్యాలు, ఆత్మ ద్రోహాలే తప్ప మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌రెడ్డి చేసింది శూన్యమని ఆయన అన్నారు. విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నానంటూ… అవినీతి, అక్రమ కేసులు, భూకబ్జాలను పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చి, అప్పులపాలు చేసి, అన్ని రంగాల్లో నాశనం చేశారని అన్నారు.

జగన్‌రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంటే బహిరంగసభల్లో బారికేడ్లు దూకి ప్రజలు పారిపోవలసిన అవసరం ఏమిటని, జగన్‌రెడ్డి నోరు తెరవగానే ప్రజలు గోడలెందుకు దూకుతున్నారని ప్రశ్నించారు. బెదిరింపులకు, ప్రలోభాలకు గురిచేసినా, పోలీసులను కాపలా పెట్టినా సభ నుంచి ప్రజలు పారిపోతున్న విషయం వాస్తవం కాదా? కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఏంటి? మీరు బహిరంగ సభలకు వస్తున్నారంటే చుట్టుపక్కల బారికేడ్లు పెట్టడం, పాఠశాలలను మూసివేయడం మీ అభద్రతా భావానికి నిదర్శనం కాదా? అని అడిగారు.

ముఖ్యమంత్రి సభకు మూడు రోజుల ముందు పాఠశాలలు, దుకాణాలు మూసివేయడం గతంలో ఎన్నడైనా జరిగిందా? అని యనమల ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలను, మహిళలను, విద్యార్థులను బెదిరించి బహిరంగ సభలకు తెచ్చుకోవడమేనా మీరు చేస్తున్న అభివృద్ధి? అని ఎద్దేవా చేశారు. ప్రజలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి పనులు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని… ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఒక్క పథకాన్నయినా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకాలను రద్దు చేసి 42 నెలలుగా నిరంకుశ ఫాసిస్టు పాలనతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని బాధపడని వర్గం అంటూ రాష్ట్రంలో లేదని అన్నారు. చేతివృత్తుల వారి నుంచి పారిశ్రామికవేత్తల వరకు, రైతుల నుంచి కార్మికుల వరకు అందరూ మీకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

జగన్‌ ప్రచార పిచ్చి తారస్థాయికి చేరిందని యనమల విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని పాలకులు కోరుకుంటారని… కానీ జగన్‌రెడ్డి తన ఫొటోలతో చరిత్రలో నిలిచిపోవాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. భూహక్కు పత్రాలపై, పాస్‌ పుస్తకాలపై, పొలాల్లోని సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ ఫోటోలు ఉండాలనడం దుర్మార్గమని అన్నారు.

అసలు రైతులకు పాస్‌ పుస్తకాలు ఇవ్వడమనేది దశాబ్దాల కాలం నుంచి అమల్లో ఉందని… ఇప్పుడు కొత్తగా జగన్‌ ఫొటో వేసి పాస్‌ పుస్తకాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి భూకబ్జాలకు పాల్పడేందుకే భూముల రీసర్వే చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అంటే ఏంటి? ప్రజల భూములపై జగన్‌రెడ్డి హక్కా? యాజమాన్య హక్కులను మార్చే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/