నా జన్మ ధన్యమైందంటున్న వంట మాస్టర్ యాదమ్మ

గత 29 ఏళ్లుగా వంటలు చేస్తూ ఎంతోమందికి రుచికరమైన వంటను అందిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న కరీంనగర్ యాదమ్మ..ఇప్పుడు మోడీ కోసం రుచికరమైన వంట చేసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలకు తెలంగాణ వంటకాలను నా చేతితో వండి వడ్డించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని, నా జన్మ ధన్యమైందని యాదమ్మ చెప్పుకొచ్చింది. తాను నోవాటేల్ దగ్గరకు రాగానే బండి సంజయ్ కారు పంపి తనను వెంటనే లోపలికి తీసికెళ్లి గొప్పగా చూసుకున్నారని ఆమె అన్నారు. లోపలికి వెళ్ళగానే ప్రధాని మోడీతో కలిసి భోజనం చేసి అవకాశం దక్కడం జీవితంలో మరిచిపిలేనని ఆమె అన్నారు. ప్రధాని సహా దేశంలోని మహా మహులకు వండి పెట్ట అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన బండి సంజయ్ కు శతకోటి దండాలు.. ఆయనకు రుణపడి ఉంటా అని యాదమ్మ అన్నారు.

ఇక సోషల్ మీడియాలో యాదమ్మ ఫై వస్తున్నా పుకార్లను ఖండించింది. తనను నోవాటేల్ లోకి రానివ్వలేదని కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేశారని యాదమ్మ మండిపడ్డారు. కొందరు సోషల్ మీడియా యువకులు కింద కూర్చోమని చెప్పి ఫోటో తీశారని, తనకు వాళ్ళ దుర్బుద్ధి అర్థం కాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు. యాదమ్మ వంటలను ఇప్పటికే తెరాస మంత్రులతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రుచిచూశారు. ఈక్రమంలో మోడీ సమావేశాలకు యాదమ్మ కు ఛాన్స్ ఇచ్చారు. సంజయ్ పెట్టుకున్న నమ్మకాన్ని యాదమ్మ నిలబెట్టుకుంది.