భారీ వర్షాలకు మరోసారి యాదాద్రి టెంపుల్ నిర్మాణ లోపాలు బయటపడ్డాయి

,

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లోపాలు బయటపడుతున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడడంతో ఆలయంలో లీకులు బయటపడ్డాయి. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో వాటర్ లీక్ అవుతుంది. ప్రధానాలయం అష్టభుజి, గోడ ప్రాకార మండపం, ప్రథమ ప్రాకార మండపాలతో పాటు ప్రధానాలయ ముఖ మండపంలోని ఏసీల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. అలాగే ఆలయంలోని ఫ్లోరింగ్ 10 మీటర్ల మేర కుంగింది. ప్రధాన ఆలయంలోని దక్షిణ రాజ గోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ కుంగింది.

గతంలోనూ చిన్న వానకే ఫ్లోరింగ్ కుంగడంతో.. రాతి బొండలు తొలగించి రిపేర్లు చేశారు. రిపేర్లు చేసి ఏడాది కాకముందే ఫ్లోరింగ్ కుంగింది. దీంతో మరోసారి నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. గతంలో కూడా ఓ చిన్నపాటి వర్షానికే యాదగిరిగుట్టపై ఘాట్‌ రోడ్డు కుంగింది. ఈ ఘటన అప్పట్లో పలు విమర్శలకు దారి తీసింది. పార్కింగ్ బాదుడుపై ఉన్న శ్రద్ధ..నాణ్యతపై లేదా..? అనే విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పున: నిర్మించిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా పిలువబడుతుంది. పున ప్రారంభం తర్వాత భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. శని , ఆదివారాల్లో అయితే స్వామి వారిని లక్షల్లో భక్తులు దర్శించుకుంటున్నారు.