ఈడీ పై షియోమీ ఇండియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

బెదిరింపుల‌తో ఈడీ తాను కోరిన‌ట్టు వాంగ్మూలం సేక‌రించింద‌న్న షియోమీ

న్యూఢిల్లీ: తీవ్ర‌మైన ఆర్థిక నేరాల ద‌ర్యాప్తు కోసం ప‌నిచేస్తున్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులపై చైనా మొబైల్ ఫోన్ త‌యారీ సంస్థ షియోమీకి చెందిన భార‌త అనుబంధ సంస్థ షియోమీ ఇండియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. విదేశీ మార‌క ద్ర‌వ్య నియంత్ర‌ణ చ‌ట్టాన్ని (పీఎంఎల్ఏ) ఉల్లంఘించారంటూ ఇటీవ‌లే షియోమీ ఇండియాకు చెందిన రూ.5,551 కోట్ల న‌గ‌దు నిల్వ‌ల‌ను ఈడీ సీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై కోర్టును ఆశ్ర‌యించిన షియోమీ ఇండియా.. విచార‌ణ పేరిట ఈడీ అధికారులు త‌మ సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధుల‌పై భౌతిక దాడుల‌కు దిగార‌ని ఆరోపించింది.

షియోమీ ఇండియా పీఎంఎల్ఏ చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తోంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఈడీ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విచార‌ణ పేరిట త‌మ సంస్థ ప్ర‌తినిధుల‌ను పిలిచిన ఈడీ అధికారులు వారిపై భౌతిక దాడికి దిగార‌ని షియోమీ ఆరోపించింది. ఇక త‌మ కంపెనీ మాజీ ఎండీ మ‌నుకుమార్ జైన్‌, ప్ర‌స్తుత సీఎఫ్ఓ స‌మీర్ బీఎస్ రావుల‌ను ఈడీ అధికారులు బెదిరించార‌ని కూడా షియోమీ ఆరోపించింది. తాము చెప్పిన‌ట్లుగా వాంగ్మూలం ఇవ్వ‌కుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని… అందులో భాగంగా అరెస్టులు, దాడులు, ఉద్యోగ ప‌రంగా ఇబ్బందులు ఉంటాయ‌ని బెదిరించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ బెదిరింపుల కార‌ణంగానే ఈడీ కోరిన‌ట్లుగానే త‌మ ప్ర‌తినిధులు వాంగ్మూలం ఇచ్చార‌ని షియోమీ తెలిపింది.

ఇదిలా ఉంటే… ఈడీ జ‌ప్తు చేసిన రూ.5,551 కోట్ల న‌గ‌దు నిల్వ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని కోర్టు ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతానికి న‌గ‌దు నిల్వ‌ల‌ జ‌ప్తును నిలిపివేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం నాడు జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేయ‌గా…ఈ కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తు ఈ నెల 12న జ‌ర‌గ‌నుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/