పెరిగిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పదవీ కాలం!

విజన్ 2035కు సీపీసీ ఆమోద ముద్ర…మరో 15 ఏళ్లు

పెరిగిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పదవీ కాలం!
Xi Jinping

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరో 15 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది. జిన్‌పింగ్ రూపొందించిన 14వ పంచవర్ష ప్రణాళిక విజన్ 2035కు అధికార కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) ఆమోద ముద్ర వేయడంతో ఆయన పదవికి మరో 15 ఏళ్లపాటు ఎటువంటి ఢోకా లేదని చెబుతున్నారు. 2021-2035 మధ్య దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రూపొందించిన ఈ దీర్ఘకాలిక ప్రణాళికపై నాలుగు రోజులపాటు జరిగిన పార్టీ ప్లీనరీ సదస్సులో విస్తృతంగా చర్చలు జరిపారు. చైనా పూర్తిస్థాయిలో స్వయం సమృద్ధిని సాధించేందుకు, దిగుమతుల్ని పూర్తిగా నిషేధించి స్వదేశీ మార్కెట్‌ను ప్రోత్సహించేలా రూపొందించిన పంచవర్ష ప్రణాళికకు సదస్సు చివరి రోజైన గురువారం ఆమోదించారు.

చైనాలో మావో తర్వాత జిన్‌పింగ్ (67) అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. ఒకే వ్యక్తి రెండుసార్లు దేశాధ్యక్షుడిగా ఉండరాదన్న నిబంధనలను రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి, జీవితాంతం తానే అధికారంలో కొనసాగేలా చేసుకున్నారు. ప్రస్తుతం రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్న జిన్‌పింగ్ పదవీకాలం 2022లో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజన్ 2035కు గ్రీన్ సిగ్నల్ లభించడం ద్వారా మరో 15 ఏళ్లపాటు పదవిలో కొనసాగే అవకాశం ఉంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/