గణపతి ఆరాధనే ముక్తిసాధనకు మార్గం
ఆధ్యాత్మిక చింతన

శుక్లాంబరధరమ్ విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశమ్
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే…
అంటూ ఏ పూజ చేస్తున్నా
ముందుగా ఆదిదేవుడైన
గణనాధుని ప్రార్థిస్తూ చేస్తున్న కార్యంలో ఎలాంటి విఘ్నాలు
ఎదురవకూడదని కోరుకుంటూ
గజాననం భూతగణాధి సేవితం
కపిధ్వజం భూఫలసార భక్షితం
ఉమాసుతం శోకవినాశకారణం
నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్
అంటూ గణేశుని స్తుతిస్తూ..
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముషమ శ్రవస్తమమ్
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
అ నాః శ్రుణ్ణన్ ఊతభి సీదసాదనమ్
అంటూ ముప్పదిరెండు వేల కోట్ల దేవతాకోట్ల దేవతాగణాలకు అధిపతి అయిన ఆ గణనాధుని కొలవడమంటే ముక్తిసాధనవైపు ప్రయాణం చేసినట్లే.
పంచమవేదమయినటువంటి మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు వ్యాసమహర్షి చెబుతుండగా, అందులోని శ్లోకాలను అర్ధం చేసుకుని విఘ్నేశ్వరుడు రాయడం జరిగింది.
విఘ్నేశ్వరుడు త్రిగుణాలకు, పంచభూతాలకు ఆత్మ. పార్వతీ ముఖ పద్మమును వెలిగించువాడు. ఏనుగు ముఖమును కలిగినవాడు. గజవదనం తండ్రి శివుని చేత ఇవ్వబడింది.
మానవ శరీరం తల్లి పార్వతీదేవి ఇచ్చినది.
అలాంటి గణనాధుని భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా జరుపుకుంటారు. గణనాధుని పిల్లలు, పెద్దలు అందరూ పూచిస్తారు.
ముఖ్యంగా విద్యార్థులు కొలిచితే వారికి మేధోసంపత్తి చేకూరుతుంది. గణనాధుని రూపం మానవాళికి గొప్ప తత్త్వాన్ని బోధిస్తుంది. ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి గుర్తు.
పెద్ద ఆకారం గల చెవ్ఞలు ఎదుటివారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినడానికి గుర్తు.
ఒక చేతిలో పరశు (గొడ్డలి) అజ్ఞానాన్ని ఖండిస్తుంది. ఇంకో చేతిలో ఉండే పాశం విఘ్నాలను నివారిస్తుంది.

విరిగిన దంతం త్యాగానికి చిహ్నం. తొండము ప్రణవనాదం, ఓంకారానికి గుర్తు.
నాగబంధం శక్తికి, యోగశాస్త్రంలోని కుండలికి ప్రతీక.
ఎలుక వాహనం సృష్టిలోని అన్ని జీవరాశులపైన ఉన్నటువంటి సమానత్వానికి గుర్తు.
మానవ శరీరం ప్రకృతికి, మాయకు ఉదాహరణ.
‘ఆనాందాత్మి గణేషోయమ్ – గణనాధుని రూపంఅందరినీ ఆనందానికీ, ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఏకదంతం అశురసంహారానికి గుర్తు.
అయితే రెండు దంతాలు కల్గినవి మగ ఏనుగులని, దంతాలు ఉండనివి ఆడ ఏనుగులని సృష్టిధర్మం.
అయితే మరి ఒకే దంతంతో వినాయకుడు ఉండటాన్ని పార్వతీపరమేశ్వరులుగా (అర్ధనారీశ్వర రూపానికి ప్రతిరూపంగా) చెప్పుకోవచ్చు.
మూషికవాహనం అనగా పురాణా ప్రకారం క్రౌంచ్యుడు అనే గంధర్వుడు శాపం వల్ల ఎలుకగా మారి మహర్షులు చేస్తున్న యజ్ఞ, యాగాదుల్లో యజ్ఞవాటికల్లోకి చేరుకుని విఘ్నాలు కలిగిస్తుంటుంది.
దాన్ని ఆపడం ఎవ్వరితరము కాక, విఘ్నేశ్వరున్ని ప్రార్ధించగా విఘ్నేశ్వరుడు తన పాశంతో ఆ మూషిక రూపంలో ఉన్న గంధర్వున్ని నిలిపవేస్తాడు.
ఆ తరువాత గణనాధుడు ఏం కావాలో కోరుకొమ్మని క్రౌంచ్యుని అడగగా ఇంతకంటె వరమేమీ అక్కర్లేదని, ఎప్పటికీ నీ దగ్గరే ఉండేలా అభయమియ్యమని వేడుకోగా, మూషికరూపంలో తనకు వాహనంగా ఉండిపొమ్మని వరమిచ్చి అప్పట్నుంచి మూషికవాహనుడైనాడు.
వినాయకచవితిని జరుపుకోవడంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ధార్మికాంశాలున్నాయి. తాత్త్విక పరమయిన అంశాలున్నాయి.

సంస్కృతీసంప్రదాయాలను తెలిపే అంశాలున్నాయి. ముఖ్యంగా ఉపాసనా సంప్రదాయాలున్నాయి. అనుష్ఠానం చేసేవారు జపం, మంత్రంలాంటి వాటిని అనుసరిస్తూ ఉంటారు. ప్రతి మాసంలో రెండు చవితిలు వస్తాయి.
అవి శుక్లపక్షంలో వచ్చే చవితి. దీనినే ‘వరదా చవితి అంటారు. ఈ చవితినాడు గణనాధున్ని కొలిచినట్లయితే కోరిన కోరికలు తీరుస్తాడు. ఇంకొకటి కృష్ణపక్షంలో వచ్చే చవితి.
దీనినే ‘సంకష్టచతుర్థి అంటారు. సంకష్టహార చతుర్థినాడు విఘ్నేశ్వరున్ని కొలిచినట్లయితే కష్టాలను తీరుస్తాడు.
గణపతి నవరాత్రులను భాద్రపద మాసం శుద్ధచవితి నుండి నవమి వరకు లేదా పాడ్యమి నుండి నవమి వరకు నిర్వహిస్తారు. పృథ్వి అనేది భూమి. జడపదార్థం.
జలము అనేది ఎంతో చైతన్యవంతమయింది. మట్టి, నీటి కలయిక ప్రాణశక్తినిస్తుంది. వీటి కలయికతోనే సృష్టి, ఆహారం, ఆయుర్వేద మూలకాలు, రోగాలను నయం చేసేటటువంటి వైద్యసంబంధమైనటు వంటి మందులు ఏర్పడతాయి.
మట్టి, నీటి కలయికలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి. పురాణాల ప్రకారంగా చూసినట్లయితే వినాయకుడికి సంబంధించినటువంటి మూర్తి రూపాల్లో ఆగమశాస్త్రం ప్రకారంగా 32 రూపాలు మాత్రమే ఉన్నాయి
. ఇందులో అతి ముఖ్యమైనవి పదహారు. అందులోనూ చింతామణి గణపతి చాలా శ్రేష్టమయినది. చింతామణి గణపతిని గనుక కొలిచినట్లయితే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం.
దానినే ‘రత్న గర్భగణపతి అంటారు. ఈ రత్నగర్భ గణపతి మూర్తి శ్రీశైలంలోని ఆలయంలోని ఉపాలయంలో ఉంటుంది.
కాశీక్షేత్రంలో 56 రకాల గణపతులు వివిధ పేర్లతో పూజలందుకుంటాయి.
‘ఈశ్వరః సర్వభూతేసు వృద్ధేసే అర్జున తిష్టతి గణము అనగా సమూహం, గుంపు, కలయిక అని అర్ధము. సృష్టి అంతా కూడా ఎన్నెన్నో జీవరాశుల కలయిక.
మనుషులపు అందులో స్త్రీ, పురుషులు, వేషభాషలు, ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, ఎన్నో ఆలోచనలు, చెట్లు అందులో రకాలు, జలము –
అందులో రకాలు. పక్షులు వాటిలో రకాలు, జంతువులు అందులోనూ అనేక రకాలు వీటన్నింటి కలయికే గణము. ఇన్ని గణాలకు అధిపతియే ‘గణపతి. నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు. వినాయకము అంటే వినయం అని అర్ధం.
నాయకత్వంతో వినయంగా ముందుండి తీర్చిదిద్ది నడిపించేవాడని అర్ధము. గజవదనం ద్వారా మనిషి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించవచ్చు.
భౌతికశాస్త్రం ప్రకారంగా చూస్తే ఒక గజము ఎంతో దూరంలో ఉన్నటువంటి ఇంకో గజము ఉనికిని కనిపెట్టగలదు. అంతటి శక్తి ఏనుగుకు ఉంటుంది.

గణేశుడు ‘జ్ఞానదేవుడు. జ్ఞానాన్ని ప్రసాదించువాడు. గణపతిని కొలిచినంతనె స్థిరత్వము కలుగుతుంది. శ్రద్ధ, పట్టుదల, సంకల్పసిద్ధి పెరుగుతుంది. గణపతి తత్త్వం ప్రతిమనిషి తెలుసుకోవాల్సింది.
ఓంకారం లేనిదే ఏ మంత్రాన్ని పలుకలేము. గణపతిని ఆరాధించనిదే ఏ దేవ్ఞడిని కొలువలేము. గజము అనగా ఐశ్వర్యము. బలము,జ్ఞానమని అర్ధం.
అందుకే లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు ఏనుగులు ఉంటాయి. అటువంటి పటం ఉంటే ఐశ్వర్యమని అర్ధం.
- శ్రీనివాస్ పర్వతాల
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/