ఆహార భద్రతా చట్టం అమలయ్యేనా?

నేడు అంతర్జాతీయ ఆహార దినోత్సవం

ఆహార భద్రతా చట్టం అమలయ్యేనా?
World Food Day

దేశంలో మాతాశిశు మరణాల నిష్పత్తి నేటికీ ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాల కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి.

పై సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలను ప్రభుత్వాలు నియమించిన కమిటీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు గతంలో ఎన్నోసార్లు సూచించాయి.

కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు దశాబ్దాలు గడుస్తున్నా ఆహార హక్కు మానవ హక్కుల్లో భాగంగా గుర్తించి ప్రజలందరికీ పౌష్టి కాహారాన్ని అందించడంలో విఫలం అవుతున్నాయి.

గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం, ప్రజాసంఘాలు ఆహార హక్కు అమలు జరిపించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వాలు కదిలి ఆయా చట్టాలను, పథకాలను రాజకీయ సంకల్పంతో అమలు జరపడానికి అవకాశం ఉంటుంది.

ఈ సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబరు 16వ తేదీ జరుపుకునే సందర్భంగా 2020 సంవత్సరం నోబెల్‌ బహుమతికి ప్రపంచ ఆహార కార్యక్రమం సంస్థ ఎంపిక కావడం ఎంతో సముచితంగా ఉంది. ఆకలి వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలిచినందుకు ఈ బహుమతి ఇవ్వ బడింది.

తద్వారా ప్రపంచ పటంపై ఆకలిని అంతమొందించే బృహత్‌ కార్యక్రమం ప్రాధాన్యాన్ని నోబెల్‌ కమిటీ మొత్తం మాన వాళి ముందుంచింది.

ఈ సందర్భంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లే స్పందిస్తూ భూగోళంపై ఆకలి ఉన్నంతకాలం శాంతియుత ప్రపంచాన్ని చూడలేం అన్నారు.

నేడు పరిస్థితి ఏమంటే ప్రతి ఒక్కరికి సరిపడా ఆహార ఉత్పత్తి జరుగుతున్న ప్పటికీ ఆకలితో అలమటించే అన్నార్తుల సంఖ్య ఇంకా గణనీయంగా ఉండటం.

అంటే ఉత్పత్తి జరిగినప్పటికీ పంపిణీ వ్యవ స్థలు సమాజంలోని బాధిత కుటుంబాలకు అనుకూలంగా లేవనే వాస్తవాన్ని మనం గుర్తించాలి.

2020లో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పోషణపై ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఒ) ఇచ్చిన నివేదిక 2019 నాటికి దాదాపు 200 కోట్ల మంది ప్రజలు సురక్షితమైన, పుష్టికర, సరిపోయేంత ఆహారం అందుబాటులో లేదని తెలిపింది.

పూర్తిగా ఆకలితో అలమటించే పేదలు 2030 నాటికి 84 కోట్లను మించిపోతారని చెప్పింది.

ఈ సంవత్సరం కరోనా కాలంలో 13 కోట్ల మంది అదనంగా చేరతారని అంచనా వేసింది. వీరిలో అత్యధికులు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, మురికివాడల్లో నివసించేవారు, ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అని పేర్కొంది.

మనదేశంలో లాక్‌డౌన్‌ అనంతరం కనబడని ఆకలిచావ్ఞలు కరోనా మృతుల కంటే ఎక్కువగా ఉంటా యనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది.

పౌష్టికాహారలేమితో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వాళ్లే ఎక్కువగా అంటువ్యాధులకు, మరణాలకు గురవడానికి ఆస్కారం ఉంది.

ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువ. యూనిసెఫ్‌ సంస్థ ఈ ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఉంటే అందులో మూడు లక్షల మంది భారతదేశంలోనే ఉంటారని హెచ్చరించింది.

2019లో విడుదల చేసిన భౌగోళిక ఆకలి సూచిక ప్రకారం భారతదేశం 117దేశాల్లో 102వ స్థానంలో ఉంది. బంగ్లా దేశ్‌, నేపాల్‌లు మన కంటే మెరుగ్గా ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా 25వ స్థానంలో ఉంది.

2017 జాతీయ ఆరోగ్య సర్వే మనదేశంలో 19కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఆకలితో అలమటిస్తున్నారని, 4,500 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఆకలి పోషకాహార లోపం వలన మరణిస్తున్నారని తెలిపింది.

ఆహారభద్రత చట్టం ఆవిర్భావం, అమలు

ఆహార హక్కు ఐక్యరాజ్యసమితి 1948లో వెలువరించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో గుర్తించబడి, 1966లో ఆమోదించబడిన ఆర్థికసామాజిక సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒప్పందంలో స్పష్టపరచబడింది.

ఈ ఒప్పందం అమలు కమిటీ 1999లో ప్రతి ఒక్కరికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కును గుర్తించాలని ఆయా దేశాలను ఆదేశించింది. 2000 సంవత్సరంలో భారతదేశం ఆమోదించిన ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధి ప్రకటనలో 2015 నాటికి ఆకలి, దారిద్య్రాన్ని తగ్గిం చాలని పేర్కొనబడింది.

తదనంతరం 2015లో ఆమోదించబడిన ప్రకటనలో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆకలి దారిద్య్రాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించబడింది. మన దేశం రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగానే ఆహార హక్కు గుర్తించబడింది.

అలాగే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 47 ప్రకారం ప్రజలందరికీ పౌష్టికాహారాన్ని అందచేయడం,జీవన, ఆర్థిక,ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుచుటకు రాజ్యం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పబడింది.

2001లో దేశంలో ఒకవైపు ఆహార నిల్వలు పేరుకు పోయి మరొకవైపు ఆకలి అంతటా అలుముకున్న సందర్భంలో పిపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియు.సి.యల్‌) స్వచ్ఛంద సంస్థ భారత ప్రభుత్వం, భారత ఆహార కార్పొరేషన్‌, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలపై తక్షణం ప్రజలకు ఆహార సహాయాన్ని అందించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని వేసింది.

ఆ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు చొరవ, ప్రజాఉద్యమాల ఒత్తిడి కార ణంగా భారత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను, కొన్ని చట్టా లను తీసుకువచ్చింది.అందులో ముఖ్యమైనవి.

2005లో తీసుకొ చ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం. ఈ కొవిడ్‌ సందర్భంగా గ్రామాలకు తరలివచ్చిన వలస కార్మికుల కు ఈ పథకం సంజీవనిగా పనిచేసింది. తదనంతరం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకురాబడింది.

జాతీయ ఆహార భద్రత చట్టం తీరుతెన్నులు

ఈ చట్టంలోని నాలుగు ప్రధాన అంశాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ, 6-14 సంవత్సరాల మధ్య వయసు బాలలకు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరు నెలలు-ఆరు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం,.

మాతాశివ్ఞ సమగ్రాభివృద్ధి పథకం అనగా గర్భవతులుగా ఉన్నప్పుడు బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లుల సంరక్షణ. మొదటిది ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ చేయాలంటే ముందుగా లబ్ధి దారులను గుర్తించగలగాలి.

నేటికి కూడా కోట్లాది వలస కూలీ లను, ఇల్లులేని వారిని, అనాధలను, గిరిజనులను గుర్తించడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేదు. బయోమెట్రిక్‌ విధానంలోచాలా మంది అర్హతను కోల్పోయారు.

తర్వాత సమస్య ధాన్యం కొనుగోలు, నిల్వకు సంబంధించినది.కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్యసమన్వ యం లేకపోవడం వలన గోడౌన్లు చాలక ఆహారం ఎంతో వృధా అవుతోంది.

అంతేగాక పంపిణీ కేంద్రాల్లో ఆహార ధాన్యాలు నాసి రకంగా ఉన్నచోట్ల కొనేవారు లేక పక్కదారి పట్టి ఇతర విధాలుగా ఉపయోగించబడుతున్నాయి.

రెండవది మధ్యాహ్న భోజన పథకా నికి నిధుల కొరత, భోజన నాణ్యత లోపం అవినీతి అజమాయిషీ లేకపోవడం, ప్రైవేటీకరణ సమస్యలు వెంటాడుతున్నాయి.

మూడవది అంగన్‌వాడి కేంద్రాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సరైన భవనాలు లేకపోవడంతోపాటు నీరు, కరెంటు, డ్రైనేజీ సమ స్యలు వంటకు కావలసిన సరుకులు మందుల కొరత, నిధుల కొరత అంగన్‌వాడీ కార్యకర్తలకు అతి తక్కువ వేతనాలు చెల్లింపు లో జాప్యం తదితర సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి.

నాలుగ వది మాతాశిశు సమగ్రాభివృద్ధి అమలుపై ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిపిన సర్వే ప్రకారం కేవలం 22శాతం మహిళలకు నగదు, 14 శాతంమహిళలకు మాత్రమే పూర్తి ప్రయోజనం కలిగినట్లుగా కొను గొనబడింది.ఈ పథకానికి నిధుల కొరత, దరఖాస్తు చేసుకోవ డానికి క్లిష్టమైన ప్రక్రియ, ఆధార్‌ కార్డు అడ్రస్‌ సమస్య తదితర సమస్యలున్నాయి.

అందువల్ల నేటికీ గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో, జననేంద్రియ సమస్యలతో బాధపడుతున్నారు. అందువల్ల మన దేశంలో మాతాశిశు మరణాల నిష్పత్తి నేటికీ ఐక్యరాజ్యసమితి నిర్దే శించిన లక్ష్యాల కంటే ఎంతో ఎక్కువగాఉన్నాయి. పై సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలను ప్రభుత్వాలు నియమించిన కమిటీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు గతంలో ఎన్నోసార్లు సూచించాయి.

కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు దశాబ్దాలు గడుస్తున్నా ఆహార హక్కు మానవ హక్కుల్లో భాగంగా గుర్తించి ప్రజలందరికీ పౌష్టి కాహారాన్ని అందించడంలో విఫలం అవుతున్నాయి.

గత అనుభ వాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం, ప్రజాసంఘాలు ఆహార హక్కు అమలు జరిపించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వాలు కదిలి ఆయా చట్టాలను, పథకాలను రాజకీయ సంకల్పంతో అమలు జరపడానికి అవకాశం ఉంటుంది.

  • డాక్టర్‌ పి. నారాయణరావు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/