వెట్టి చాకిరికి ఏదీ విముక్తి?

నేడు వెట్టికార్మిక వ్యవస్థ నివారణ దినోత్సవం

IMG111
Workers

వెట్టి చాకిరికి ఏదీ విముక్తి?

భా రతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక సమస్య వెట్టిచాకిరి. దేశమంతా వ్యాపించి వున్న సమస్య. దీని స్వభావంలోను,లక్షణాలలోను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య తేడా వుంటుంది. నిర్బంధ శ్రమ, బండచాకిరి దీని ప్రత్యేకత. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం దీనిలో కనిపిస్తుంది. వెట్టిచాకిరి మానవహక్కుల సమస్య. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వున్న,సంక్షేమ రాజ్యంగా చలామణి అవుతున్న, తరతరాలుగా వెంటాడుతున్న వెట్టిచాకిరి అంతం కాకపోవడం, చట్టం వున్న చట్ట బండగా మారడం, నాగరిక సమాజ వికృత రూపానికి దర్పణంగా నిలుస్తుంది. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం-1976 ప్రకారం వెట్టిచాకిరి అనగా ఒక నిర్ణీత కాలం లేదా నిర్ధిష్ట కాలం కాకుండా ఋణగ్రస్తుడికి లేదా అతని కుటుంబానికి, భూస్వామికి మధ్య జరిగే వేతన పూరిత లేదా వేతన రహిత ఒప్పందం. వెట్టిచాకిరిలో వ్యక్తికి ఎటువంటి స్వేచ్ఛ వుండదు. నిర్ణయాధికారం వుండదు. హక్కులు కూడా వుండవు. సౌకర్యాలు సైతం అంతంత మాత్రమే. మానసికంగా, శారీరకంగా వాళ్లని హింసించడం వాళ్ల శ్రమను దోచుకోవడం వెట్టి వ్యవస్థలో పరిపాటి. వెట్టి చాకిరి కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. వివిధ దేశాలలో వివిధ రూపాలలో వుంది. ప్రధానంగా ప్రపంచంలో 171 దేశాలలో నెలకొని వుంది. వెట్టి చాకిరిలో అతిదారుణంగా జీవిస్తున్న వారిసంఖ్య ఖచ్చితంగా తెలియడం లేదు. అరకొర లెక్కలే తప్ప పూర్తి వివరాలు సమగ్ర సమాచారం,లభ్యం కావడం లేదు.

అంగారక గ్రహం మీద అడుగు పెడుతున్న, రోదసీ రంగంలో వీరవిహరం చేస్తున్న మన ప్రగతిని వెట్టి దురాచారం వెక్కిరిస్తుందనడం అతిశయోక్తి కాదు. గ్రామీణ సమాజంలోని పెట్టుబడిదారి వ్యవస్థ స్వభావానికి మచ్చుతునక వెట్టిచాకిరి. దేశంలోని మొత్తం వెట్టిచాకిరిలో 70 శాతం బాలకార్మిక వ్యవస్థకు సంబంధించినదే కావడం విశేషం.దేశంలోని కొన్ని ప్రదేశాలలో భూస్వాములు సంవత్సర ప్రాతిపదికగా వెట్టి కార్మికులకు చెల్లించవలసిన వేతనాలని లేదా ప్రతిఫలాన్ని ధన రూపంలో కాని, కొంత ధాన్యరూపంలో కాని చెల్లించి కొంత ఋణం క్రింద జమ చేస్తారు. కొన్ని చోట్ల పూర్తిగా ఋణం కింద జమ చెయ్యడం జరుగుతుంది. ఏదీ ఏమైనా వెట్టి చాకిరిలో ఉన్న వాళ్లు ఎటువంటి సుఖసంతోషాలకు నోచుకొకపోవడమే కాదు దాని నుండి బయటపడే మార్గం లేకపోవడం కడుభాదాకరం. వీరిలో ఎక్కువ మంది అట్టడుగు వర్గాల వారే. ప్రధానంగా భూమి లేని కూలీలు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ ప్రజలే. వీరు మరణిస్తే వారి వారసులు వెట్టి లో కొనసాగటం జరుగుతుంది.

వెట్టిచాకిరికి ప్రధానంగా ఆర్థిక కారణాలే కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఋణగ్రస్థత, దారిద్యం దీని ఎదుగుదలకి దోహద పడతాయి. పర్వదినాలు, వివాహాలు, మరణాలు వంటి సందర్భాలలో అతిగా ఖర్చు చెయ్యడం, అప్పుల బారిన పడటం కూడ వెట్టిచాకిరికి ఊపిరి నిలుస్తుంది. కుల వివక్ష సైతం వెట్టి వ్యవస్థకి ప్రాణం పోస్తుంది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో, అసమానతల సమాజంలో వెట్టిచాకిరికి ఎదురే లేదని చెప్పవచ్చు. వెట్టిచాకిరి వ్యవస్థ పై భారత రాజ్యాంగంలోని అధికరణ 23 ప్రకారం నిషేదం వుంది. అధికరణ 21 మానవుడు జీవించే హక్కుని కల్పిస్తుంది. అంతేకాకుండ అధికరణ 24, 14 సంవత్సరాలలోపు బాలలను పనిలో పెట్టుకొవడాన్ని నిషేదిస్తుంది. రాజ్యాంగ పరంగా పరిరక్షణలున్న ఆచరణలో సున్నా అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా వెట్టిచాకిరి వ్యవస్థను 1975 అక్టోబర్‌ 25 నుండి నిషేధించారు. ఈ మేరకు జారీ చేసిన ఆర్టినెన్స్‌ స్థానంలో వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం-1976 ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

వెట్టిచాకిరి చేస్తున్న వారిని గుర్తించి, ఈ చట్టం కింద వారికీ విముక్తి కల్పించి పునరావాస కల్పనకు పూనుకుంటారు. ఈ చట్టం దేశమంతా అమలులోకి వచ్చింది. దీనిని 1985 లో సవరించటం జరిగింది. భూస్వాములపై చర్యలు తీసుకొవడం, కనీసం మూడు నెలల కారగారశిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించటం ఈ చట్టం వల్ల జరుగుతుంది. వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై వుంటుంది. జాతాయ మానవ హక్కుల కమీషన్‌ సైతం వెట్టిచాకిరీ నిర్మూలన కోసం 2011 నుండి వివిధ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జాతీయ స్థాయిలో సదస్సులను నిర్వహించడం వెట్టిచాకిరి పై కోర్‌ గ్రూప్‌ను నిర్మించడం, వెట్టి వ్యవస్థ ఉన్న ప్రాంతాలలో పర్యటించడం, వెట్టిచాకిరీ వున్న రాష్ట్రాలలో వర్క్‌షాప్‌ల ఏర్పాటు చెయ్యడం వంటి పనులు చేపడుతుంది.

ప్రభుత్వం స్వచ్ఛంధ సంస్థల సహకారంతో చిత్తశుద్ధితో పట్టుదలతో, గురుతర బాధ్యతతో వెట్టి చాకిరిని పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అక్షరాస్యతా శాతం పెంచడం, చట్టాన్ని కఠినంగా అమలు జరపడం, వెట్టి నుంచి విముక్తి పొందిన వారికి తక్షణమే పునరావాసం కల్పించడం, కేంద్ర రాష్ట్రాలకు తగిన రీతిలో సహకరించడం వంటి చర్యలతో రకరకాలుగా వెంటాడుతున్న కట్టు బానిసత్వానికి ప్రతీకగా వున్న వెట్టి చాకిరిని నిర్మూలించవచ్చు.

ఆచార్య గిడ్డి వెంకటరమణ (రచయిత: సమాజశాస్త్ర విభాగాధిపతి)