పురోగతి ఎంత?

భారతదేశాన్ని ధర్మభూమిగా, పుణ్యభూమిగా, యోగ భూమిగా కొనియాడుతుంటారు. ఆచారాలకు, సంప్రదాయాలకు పెట్టింది పేరని ప్రశంసిస్తుంటారు. మహనీయులకు, మహాత్ములకు పుట్టిన భూమిగా గొప్పగా చెప్పుకుంటాం. నిజమే వాటిని ఎవరూ కాదనలేరు. ఏ ఒక్కరూ లేదనలేరు. కాని ఆదిశక్తిగా పార్వతిని కొలుస్తు న్నారు. చదువ్ఞ తల్లిగా సరస్వతిదేవిని ఆరాధిస్తు న్నారు. సిరిసంపదనిచ్చే తల్లిగా లక్ష్మీదేవిని పూజిస్తు న్నారు. ప్రకృతిని సైతం తల్లిగా భావిస్తున్నారు. భూమిని భూమాతగా, గోవ్ఞని గోమాతగా గౌరవిస్తున్నారు. కాని భారతీయ సమాజంలో స్త్రీ స్థితి దారుణంగా వ్ఞంది. ఆమె గురించి ఆలోచించవలసిన అవసరం చాలా వ్ఞంది. మహిళ ప్రగతి విషయమై చర్చించవలసి ఉంది.

Women empowerment
Women empowerment

వేగవంతంగా చర్యలు తీసుకొని ఆమె పురోగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రత్యేకించి పాలకులు మహిళాభ్యున్నతిపై దృష్టి పెట్టాలి. దానికి అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి 8వ తేది) శాంతి పలకాలి. అనాదిగా స్త్రీని అబలగా చిత్రీకరించారు. పుట్టింది మొదలుకొని చివరిదాక ఆమె ఎదుగుదలకి అడుగుడుగున గండాలే సుడిగుండాలే, నిందలే నిర్భందాలే. సాహిత్యంలో సైతం స్త్రీ అందానికి పెద్దపీఠ వేశారే గాని ఆమె ఆవేదనకు అవకాశం కల్పించలేదు.

ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించలేదు. ప్రాచీన సాహిత్యంలోని స్త్రీని చిత్రించిన తీరు దారుణం. అంగాంగ వర్ణన తప్ప అందులో ఏదీ కానరాదు. అయితే ఆధునిక సాహిత్యంలో మార్పు వచ్చిన మాట వాస్తవమే. ఆధునిక కాలంలో అంతరిక్షంలో అడుగెడుతున్న సమయంలో స్త్రీ ఎంతో ఎత్తుకి ఎదిగిందని, ఎన్నో ఎన్నెన్నో విజయాల్ని సాధించినదని, ప్రగతిపధంలో పయనిస్తుందని రాజకీయవేత్తలు మొదలుకొని మేధావ్ఞల వరకు ఏకరువ్ఞ పెడుతున్నారు. కొంత వాస్తవంలో వ్ఞన్న ఆలోచిస్తే, పరిశోధిస్తే అసలు నిజాలు తెలిస్తే అతివల పరిస్థితి ఘోరంగా ఉందని తెలుస్తుంది. చేయని నేరానికి స్త్రీ బలపశువ్ఞగా మారిన ఉదంతాలు కోకొల్లలు. స్త్రీశిశుహత్యలు, భ్రూణహత్యలు, వరకట్న చావ్ఞలు, గృహహింస సర్వసాధారణమైపోయాయి. ఇటువంటి వార్తలు లేని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజునే మహిళాదినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. వివిధ దేశాలలో వేడుకగా జరుపుకుంటున్నారు. భారతదేశం కూడా దీనిని భారీగా జరుపుతుంది. మహిళల స్థితిగతుల్ని, వారి స్థాయిని అంచనా వేయడానికి, వారి ప్రగతికి సంబంధించిన పధకాన్ని సవిూక్షించడానికి, వాటిలోని లోపాల్ని సరిదిద్దటానికి, స్త్రీ సమస్యల్ని చర్చించడానికి పాలకులకు కాదు ప్రజలకు ఇదో అవకాశం. తరుణీమణుల విషయమై చర్చించే తరుణమిదే.

తగ్గుతున్న బాలికల సంఖ్య

దేశ జనాభాలో పురుషులతో స్త్రీల నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషుల ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటారు. దీనినే కేవలం నిష్పత్తి అంటారు. దేశంలో ప్రతివెయ్యి మంది పురుషులకు కేవలం 933 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యక్రమంగా తగ్గుతుంది. 1951 నుంచి 1991 వరకు లింగ నిష్పత్తి తగ్గుతూ వచ్చింది. 2011 జనభా గణాంకాల ప్రకారం దేశంలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు వ్ఞన్నారు. 2001-2011 దశాబ్దకాలంలో మాత్రం 1000 మంది పురుషులకు 933 స్త్రీల నుండి 943కి చేరుకుంది.

ఇది అంత చెప్పదగినది కాదు. స్వాతంత్య్రం నాటికి స్త్రీ పురుషుల నిష్పత్తి సమానంగా వ్ఞన్న ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. లింగనిష్పత్తిని ముఖ్యకారణం జన్మించే శిశువ్ఞ ఆడపిల్లని తెలిస్తే గర్భస్రావం ద్వారా భ్రూణహత్యలకు పాల్పడటమే. మగ సంతానం పట్ల అపారమైన మోజు కూడా పరోక్షంగా దీనికి దోహపడుతుంది. పితృస్వామ్య వ్యవస్థ వ్ఞన్న సమాజంలో మగవాళ్లకే ప్రాధాన్యత వ్ఞంటుంది. ప్రసూతి మరణాలు కూడా లింగనిష్పత్తి క్షీ ణతకు కారణమవ్ఞతున్నాయి. వీటికి తోడు శిశు మరణాల విషయంలో స్త్రీశిశువ్ఞల మరణాలు, మగశిశువ్ఞల మరణాలు ఒకవిధంగా లేవ్ఞ. మగశిశు మరణాలతో పోలిస్తే స్త్రీ శిశు మరణాలు అధికంగా వ్ఞండటం కూడా కారణంగా చెప్పవచ్చు. సమాజంలో స్త్రీకి కూడా పురుషునితోపాటు సమానావకాశాలు ఉండాలి. స్త్రీ స్వేచ్ఛకి నోచుకోవాలి. సమానత్వాన్ని పొందాలి. కాని పురుషాధిక్య సమాజంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు. సమానత్వం కానరాదు. ఆమెకి అడుగడుగున అన్యాయం జరుగుతుంది.

పెరుగుతున్నపరువు హత్యలు

ఇటీవల కాలంలో పరువ్ఞహత్యలు ఎక్కువతున్నాయి. అది మంచిదా, చెడ్డదా అని పక్కనపెడితే అసలు ప్రాణాల్ని తియ్యడం ఎంతటి నేరం. మనం నైతిక విలువలు లేని నాగరిక సమాజంలో వ్ఞంటున్నాం. మానవత్వం లేని సంఘంలో బతుకుతున్నాం. నిజంగానే సిగ్గుచేటు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు దానిని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలే కాని ఆవేశంతో హత్యలు చేయడం, చేయించడం ఎంతవరకు సమంజసం?

తల్లిదండ్రుల ఇష్టాన్ని కాదని పెళ్లి చేసుకోవడం, తన కులాన్ని విడిచి మరోకులం వ్యక్తిని ఇష్టపడటం లేదా ఒకే గోత్రానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం పరువ్ఞ హత్యలకి కారణాలు. పరువ్ఞ పోతుందని కన్నబిడ్డల్ని కాటికి పంపడమేమిటి? ఇది నాగరిక సమాజమా? కనీసం అటవిక సమాజంలో కూడా ఇలాంటివి జరగవ్ఞ. స్త్రీ ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య వరకట్నం. వరకట్న దురాచారం ఉన్నత వర్గాలకు, పేదలకు సమస్య కాదు. ఎందుచేతనంటే ఉన్నవాళ్లు ఇచ్చుకుంటారు. లేనివాళ్లు ఇవ్వకున్న పెళ్లిళ్లు చేసుకుంటారు. కాని మధ్య తరగతి వాళ్లే దానికి ఇబ్బంది పడుతున్నారు. దీనిని అడ్డుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు జరిగిన, చట్టం అమలులో ఉన్న నానాటికి కట్న సమస్య తీవ్రరూపం దాలుస్తుంది.

కొన్నిసార్లు కట్న సమస్య స్త్రీ పాలిట యమపాశంగా మారుతుంది. అత్త వేధింపులకు, మామ బెదిరింపులకు, భర్త వికృత చేష్టలకు ఆమె బలికావడం, ఆత్మహత్యకు పాల్పడటం జరుగుతుంది. వరకట్న దురాచారం సభ్య సమాజానికే మాయని మచ్చగా వ్ఞంది. తలవంపులు తెచ్చేదిగా వ్ఞంది. మానవ అక్రమ రవాణాతో అత్యధికంగా బాలికలు, స్త్రీలు ఉండటం క్షమించరాని నేరం. దానిలో ప్రధానంగా లైంగిక వ్యాపారం జరుగుతుంది. పేదరికం, నిరుద్యోగం, వితంతువ్ఞల పట్ల సమాజవైఖరి ఇవన్నీ ప్రత్యక్షం గానో, పరోక్షంగానో అక్రమ రవాణాకి ఉపకరిస్తు న్నాయి. ‘పడుపు వృత్తికి సైతం ఇవే ప్రధాన కారణాలుగా వ్ఞంటున్నాయి.

ఇంకా వివక్షలోనే మహిళలు

సమాజంలో మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, విద్య, వైద్యరంగాలన్నింటిలోను అణిచివేతకు గురవ్ఞతున్నారు. వివక్షను ఎదుర్కొంటున్నారు. విద్యాపరంగా ముందుకు వెళ్తున్నా స్థితి, ఆరోగ్యపరంగా వెనకబడిన పరిస్థితి. ఇక శిశుమరణాలు, ప్రసూతి మరణాలు సంఖ్య కూడా ఎక్కువే. పోషకాహారలేమి వీరిలో కొట్టివచ్చినట్టు కనిపిస్తుంది.

ఆర్థిక స్వాతంత్య్రం ఏది?

ఆర్థిక స్వాతంత్య్రం లేని కారణంగా వనితలు ఎంతో వెనకబడి వ్ఞన్నారు. పేదరికంలో ఉన్న స్త్రీలు వ్ఞన్నారు. పనికి దగ్గ వేతనం పొందలేని వారు అసంఘటిత రంగంలో కనిపిస్తున్నారు. చట్ట సభలలోరిజర్వేషన్లు లేకపోవడం వల్ల వీరి ప్రాతినిధ్యం లేని సంగతి సరేసరి. సమాజంలో స్త్రీ అనేకానేక సమస్యల్ని ఎదుర్కొంటున్నది. పరిష్కారం మాటకు లభించడం లేదు. ఏడుదశాబ్దాలు నిండిన స్వాతంత్య్రభారతంలో సగటు స్త్రీ స్థితి,స్థాయి గురించి ఆలోచిస్తే ఎంతైన బాధకలుగుతుంది. ఎవరికైన జాలి కలుగుతుంది.

కాని వాళ్లకి కావలసింది జాలికాదు. అభ్యుదయం. వాళ్లకు కావలసింది. ప్రశంసలుకాదు పరిస్థితులలో మార్పులు. మహిళలకు సంబంధించిన చట్టాలను ఖచ్చితంగా అమలు జరగడంతోపాటు, సంక్షేమ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టి భారతరాజ్యంగంలో పురుషులతో సమానంగా స్త్రీలకు కన్పించిన హక్కులకు సార్థకత వ్ఞండదు. మహిళారిజర్వేషన్ల బిల్లుని వెంటనే ఆమోదించి అమలులోకి తీసుకురావాలి. తద్వారా స్త్రీ సాధికారిత సాధ్యపడుతుంది. అదే అసలైన సిసలైన మహిళా దినోత్సవం ఆరోజుకై వేచిచూద్దాం. అలా జరగాలని ఆశిద్దాం.

– ప్రొఫెసర్‌ జి.వెంకటరమణ

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/