కాబూల్ యూనివర్సిటీలో కొత్త రూల్స్

యూనివర్సిటీలో మహిళలకు నో ఎంట్రీ

కాబూల్: పూర్తి ఇస్లామిక్ వాతావరణం ఏర్పడే వరకూ కాబూల్ యూనివర్సిటీలోకి మహిళలను అనుమతించబోమని ఆ వర్సిటీ ఛాన్సలర్ ప్రటించారు. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యూనివర్సిటీ ఛాన్సలర్‌ను కూడా తాలిబన్లే నియమించారు. ఇటీవల కాబూల్ మేయర్ కూడా మహిళల స్థానాన్ని పురుషులు భర్తీ చేయలేని ఉద్యోగాలు తప్ప, మిగతా ఉద్యోగాలు చేస్తున్న మహిళలను ఇళ్లకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే కాబూల్‌లో అందరూ చదువుకునే కాబూల్ యూనివర్సిటీలో కూడా మహిళల పట్ల వివక్ష ఎదురవుతోంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కాబూల్ యూనివర్సిటీ ఛాన్సలర్ మహమ్మద్ అష్రాఫ్ ఘైరాట్ తెలిపారు. ‘‘నిజమైన ఇస్లామిక్ వాతావరణం ఏర్పాటు చేసే వరకూ మహిళలు యూనివర్సిటీకి, ఉద్యోగాలకు రావడం జరగదు. ఇస్లామ్ ఫస్ట్’’ అంటూ ఘైరాట్ ట్వీట్ చేశారు.

ఆయన్ను యూనివర్సిటీ వీసీగా నియమించినప్పటి నుంచి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు వర్సిటీ ఛాన్సలర్‌గా పీహెచ్‌డీ చదివిన మహమ్మద్ ఒస్మాన్ బాబురి ఉన్నారు. కానీ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడగానే బీఏ డిగ్రీ చదివిన ఘైరాట్‌ను వీసీగా నియమించారు. ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ సుమారు 70 మంది టీచింగ్ సిబ్బంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు కూడా చేశారు. కాబూల్ యూనివర్సిటీ తీసుకున్న తాజా నిర్ణయం గతంలో తాలిబన్ పాలనకు అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. 1990ల్లో తాలిబన్లు రాజ్యమేలినప్పుడు మహిళలు బయటకు రావాలంటే ఇంట్లోని పురుషుల్లో ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. ఈ నిబంధన ఉల్లంఘించిన మహిళలను చితకబాదేవారు. అలాగే వారిని స్కూల్ మొహం చూడకుండా చేసేవారు.

తాజాగా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు మహిళా ఉద్యోగులు తప్పుబడుతున్నారు. ఇస్లాం అంటే ఏంటో కేవలం తామే నిర్ణయించగలమని తాలిబన్లు భావిస్తున్నట్లున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పవిత్రమైన స్థలమని, ఇక్కడ ఇస్లాంకు వ్యతిరేకమైన ఏ అంశమూ లేదని వారు పేర్కొన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/