‘హోదా’లో నిజమైన మార్పు ?

ఏ సమాజంలోనైనా మహిళల స్థాయిని అంచనా వేయాలంటే ఆ సమాజపు ఆర్థిక కార్యకలాపాలలో మహిళలు ఏమేరకు పాల్గొంటున్నారన్న అంశం పరిశీలించాలి. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వివక్షను ఎదుర్కొంటున్నారనేది నిర్వివాదాంశం. ఈ దేశంలో స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు అనే హితోక్తి కూడా ఉంది. పురాణాలు, వేదాలలో స్త్రీకి అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారని మాటలలో, ప్రచారాలలో గొంతులు చించుకొని అరచినా నిజాలు మారవ్ఞ. భారతదేశంలో రాజకీయ రంగంలో మహిళలు ఆరితేరారనడానికి పట్నాటి కాలంలోని నాగమ్మలాంటి శక్తి సామర్థ్యాలు గల రాజ్యభారం నిర్వహించగల మహిళా మణులు, చరితపుటల్లోకి ఎక్కని మరెందరో కాలగర్భంలో కలిసిపోయారు.

Women
Women

కాకతీయుల కాలంలో రాణిరుద్రమదేవి మొదలగు వీరనారీమణులు ఎందరో ఉన్నప్పటికీ మనం లెక్కల్లోకి చూపించి పాఠ్యగ్రంధాలలో పొందుపరచింది మాత్రం వేళ్లల్లో లెక్కించవచ్చు. స్వాతంత్య్రసంగ్రామంలో పురుషులతోపాటు తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసి ఖడ్గం పట్టి కథం తొక్కిన, బందూకు పట్ట పోరుబాటన నడిచిన, ఆర్మీలో అలుపెరుగక పోరాడినవారు ఎందరో ఉన్నప్పటికీ చెప్పుకునేది మాత్రం అరకొరవారినే. ఏ సమాజంలో చూసినా (నాగరిక, మధ్యయుగ, ఆధునిక, పాశ్చాత్య) ఎందులో చూసినా మగవాళ్లతో సమానంగా అంతకంటే ఎక్కువే భాగస్వామ్యం వహించిన మహిళలు ఉన్నా ఆ గుర్తింపు మాత్రం లభించడం లేదు. ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యంలో మాత్రం ఎనలేని వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాలకు మూలం ఎవరు? మహిళలు సమానంగా ఎందుకు చూడబడలేకపోతున్నారు? లేక మహిళలే అలాంటి భావన కలిగియున్నారా? నిజంగానే సమాజంలో స్త్రీలపై వివక్ష ఉందా? అంటే ఎందువలన ఉంది? దీనికి మూలకారణం ఏమిటి? కారణాలు ఎవరికి అంతుపట్టలేదా? ఒకవేళ తెలిసినా తెలియనట్లు ఉంటున్నారా? ఒకవేళ తెలిస్తే తెలియనట్లు నటించ డానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలే కాదు ఇంకెన్నో ప్రశ్నలకు సమాధానం ప్రశ్నార్థకమే.

అయినా స్త్రీ వివక్షకి మూలం కుటుంబం అని ఒక అంశంగా భావిస్తున్నారు. కేవలం కుటుంబం ఒక భాగమే అయినా వివక్ష బీజం పడింది మాత్రం ఈ కుటుంబంలోనే. తినే తిండిలోనూ, కట్టే బట్టలోనూ, పెట్టే బొట్టులోనూ, నడిచే నడకలోనూ, నడతలోనూ అన్నింట్లో ఆంక్షలే. ఇంకా ఆడపిల్ల ధైర్యంగా ఎలా ముందడుగు వేయగలుగుతుంది? ఆధునిక సమాజ మనోవికాసానికి మూలకారణం విద్య, విద్య అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుతుంది. అధిక జనాభాతోపాటు అధిక నిరక్షరాస్యులను కూడా భారతదేశం కలిగివ్ఞంది. ప్రపంచ నిరక్షరాస్యుల్లో 3వ వంతు మన భారతదేశం కలిగి ఉంది. దేశ వయోజనులలో సగం మంది నిరక్షరాస్యులు. అందులో 2/3 స్త్రీలు ఉన్నారు.

ప్రపంచంలో 118 దేశాలలో నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశం 82వ స్థానాన్ని కలిగి ఉంది. 20018 నాటికి 74 శాతానికి పెరిగిందని భావిస్తున్నారు. ఇందులో కేవలం తమ పేరును మాత్రమే రాసే మహిళలే అధికంగా ఉన్నారు. అంటే సంపూర్ణ మహిళా అక్షరాస్యులు లేరనేది నిర్వివాదాంశం. ప్రభుత్వాలు వివిధ పధకాల ద్వారా మహిళలను ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పినా ప్రవేశపెట్టిన పథాకలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ కేటాయించలేకపోవడం, చిత్తశుద్ధి లేక అధికారుల నిర్వహణ వలన ప్రభుత్వ పథకాలు అమలుకు నోచుకోక మహిళలు ఇంకా వెనుక స్థాయిలోనే పరుగులు తీస్తున్నారు.

పెరుగుతున్న వరకట్నాల కేసులు
నేడు మనదేశంలో సంవత్సరానికి 5వేల వరకట్న కేసులు 30వేల వరకట్న వేధింపుల కేసులు, సుమారు 5 లక్షల కుటుంబ వేధింపుల కేసులు నమోదు అవ్ఞతున్నాయి.

రోజుకు 17 వరకట్న చావ్ఞలు, కొన్ని ఉమ్మడి కుటుంబాలలో మామలు, బావలు ఇతర కుటుంబ సభ్యులు స్త్రీలపై అత్యాచారం జరుపుతున్న ఘటనలు ఉన్నాయి. సతీసహగమనం మేం ఇంకా మరచిపోలేదని మూర్ఖచాందసవాదులు రూప్‌కన్వర్‌ను అగ్నికి ఆహుతి చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రతిరోజు 54 నిమిషాలకు ఒక కిడ్నాపు జరుగుతుంటే స్త్రీకి రక్షణ ఎక్కడుంది? అయితే గత కాలంతో పోల్చుకుంటే నేడు స్త్రీకి కొంత స్వేచ్ఛను, శక్తిని ఇచ్చిన ఆర్థిక స్వావలంభన, సాంకేతికవైజ్ఞానిక రంగాలలో కూడా స్త్రీ శక్తి సామర్థ్యాలను, మేధస్సును వినియోగించి ఉన్నత పదవ్ఞలను నిర్వహిస్తున్నారు. 1997లో ఒక సర్వే ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో 46.37శాతం మంది స్త్రీలు గృహిణిలుగా కుటుంబాలలో కనిపించని శ్రమ చేస్తున్నారు. దేశంలో ప్రాధమిక స్తాయిలో 33శాతం, మాధ్యమిక స్థాయిలో 36శాతం, ఉన్నతస్థాయిలో 33శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు.
పురుషుని అధీనంలో సంపద

వ్యక్తి ఉన్నతికి, గౌరవానికి మరొక ముఖ్యాంశం సంపద.

ఈ దేశంలో సంపద పురుషుని ఆస్తి అయిపోయింది. పురుషునితో, అతనికంటే ఎక్కువగా వివిధ రంగాలలో పనిచేస్తున్న నెలనాడు డబ్బులిచ్చే యంత్రంగానే చూడబడుతుంది. ఉత్పత్తిలో మహిళలు బీడితయారీ రంగంలో 63శాతం అగ్గిపెట్టేల తయారీలో 65శాతం, విత్తనం పెట్టడంలో 78శాతం, పొగాకు తయారీలో 57శాతం, చేపల వ్యాపారంలో 54శాతం శ్రమ చేస్తూ ఉన్నప్పటికీ సంపదకు నోచుకోక అన్ని సామర్థ్యాలు ఉండి ఏమీలేనివారయ్యారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్త్రీలు సగటున పురుషుల కంటే 23శాతం ఎక్కువ శ్రమిస్తున్నారు. కాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 10శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన మొత్తం పనులలో 63శాతం స్త్రీలు చేసేవే.

కాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 61శాతంగా ఉంది. అంటే ప్రపంచం మొత్తంమీద స్త్రీలు నిరంతర్శంమిస్తూ కూడా ఏ శ్రమ చేయని వాళ్లుగానే పురుషులపై ఆధారపడేవాళ్లుగానే పరిగణింపబడుతున్నారన్న మాట. దేశాల అభివృద్ధికి సంబంధించిన ఏ దత్తాంశాలలోనూ ఈ పని వివరాలు చోటు చేసుకోకపోవడం వల్లనే స్త్రీలు అబలలు, అధీనులు అన్న భ్రమలు ప్రపంచమంతటా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో కూడా ఉపాధి, ఉద్యోగిత, సంపాదన, విద్య సదుపాయాలు, నిర్ణయాధికారం మొదలైన అన్ని అంశాలలో మహిళలు వెనుకబడి ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలో 2.3 మిలియన్ల జనాభా పేదరికంలో జీవిస్తుండగా అందులో 70శాతం మహిళలే.

ప్రపంచం మొత్తం మీద ఆహారంలో 50శాతం ఉత్పత్తి చేసే మహిళల వాటా ప్రపంచ ఆదాయంలో 10శాతం మ్తామే. మహిళలకు అందుబాటులో, నియంత్రణలో ఉన్న సంపద దాదాపు శూన్యమని చెప్పవచ్చు. మానవాభివృద్ధి నివేదికననుసరించి స్త్రీల సాధికారత అంటే స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, రాజకీయ రంగంలో చురుకైన పాత్రను నిర్వహించటం, అయినప్పటికీ గత అయిదేళ్లుగా ప్రచారంలోకి వస్తున్న సాధికారత భావన పితృస్వామ్యాన్ని గురించిన మౌలికమైన ప్రశ్నను లేవనెత్తలేకపోయింది.

కుటుంబంలోనూ, సమాజంలోనూ స్త్రీహోదా స్థితిగతుల గురించి అట్లా ఉంచి ప్రస్తుతం మనకళ్లముందు కనబడుతున్న రాజకీయ రంగాన్ని పరిశీలించినా ఈ విషయం స్పష్టమవ్ఞతుంది. పంచాయితీరాజ్‌ సంస్థలకు వర్తింపజేసిన మహిళా రిజర్వేషన్‌ వల్ల సర్పంచులుగా, యంపిటిసిలుగా స్త్రీలసంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగినప్పటికీ నామినేషన్‌ వేయడం దగ్గర నుండి పదవీ బాధ్యతలను నిర్వహించటం వరకు పురుషాధికార ఛత్రఛాయలోనే నడిపించబడడం మన కళ్లముందే కనిపిస్తున్న వాస్తవం.

స్త్రీలు స్వచ్ఛందంగానూ, స్వతంత్రంగానూ, స్వయం శక్తితోనూ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయగలిగిన పరిస్థితులు లేనప్పుడు గుణాత్మక అభివృద్ధి అభావమవ్ఞతుంది. ఫలితంగా పరిణామాత్మక అభివృద్ధి అలంకారప్రాయం అయ్యిందే తప్ప సారవంతమైంది కాలేకపోయింది. కనుక మనం స్త్రీహోదాకు సంబంధించిన ఏ పార్శ్యాన్ని గురించి చర్చించేటప్పుడైనా పరిమాణం, గుణం అన్న ఈ రెండు అంశాల ప్రాతిపాదికగానే ఒక అంచనాకు రావలసి ఉంటుంది. అభివృద్ధి అలంకారప్రాయం మాత్రమేనా?