గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన..

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని , ఆ ఇంటికి ప్రభుత్వ పధకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని నేతలకు ఆదేశించారు. ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో ప్రతి ఒక్క నేత ప్రతి గడప తొక్కుతూ ప్రభుత్వ పధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇంటి ముందు కు వచ్చిన చాలామంది నేతలను ప్రజలు నిలదీయడం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే చిట్టిబాబుకు సైతం ఇదే ఎదురైంది.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టిబాబును ఓ మహిళా నిలదీసింది. తమ కోసం పని చేస్తారని.. తమ అభివృద్ధికి సహకరిస్తారని ఓటు వేశామని.. కానీ ఇప్పుడు గొంతెత్తితో గొంతు కోసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మీరు మా కొంపలు ముంచుతున్నారు.. మాట్లాడితే పోలీసు కేసులండి బాబూ.. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఉన్నాడంటూ బెదిరింపులు.. ఎన్నికల సమయంలో మీ కోసం పోరాడామండి.. నాడు జగన్‌కే ఓటేశాను.. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఎదుట దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరంటూ ఎమ్మెల్యే చిట్టిబాబు ఆ మహిళను ప్రశ్నించగా.. ‘వైసీపీ గ్రామ కమిటీ సభ్యులే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఎన్నో కేసులు పెడుతున్నారు.. మాట్లాడితే ఎస్సై వచ్చేస్తున్నారు.. మా అబ్బాయి ఏమీ చేయకపోయినా అత్యాచారం కేసు పెట్టారు. మీ వెనకాల ఉన్నవారే అక్రమ కేసులు పెట్టించారు. నా భర్త చనిపోయాడు.. నా అల్లుడు చనిపోయాడు.. చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. దేవుడు ఉన్నాడండి అన్నీ చూస్తున్నాడు’ అంటూ ఆ మహిళ ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.