కౌన్సెలింగ్‌తో ఆ సమస్యలు దూరం

మానసిక సమస్యలకు పరిష్కార వేదిక

with counseling are far away
with counseling are far away

భర్తలోపం ఉన్నా భార్యనే నిందించే లోకం మనది. ముల్లు ఆకుమీద పడినా ఆకు ముల్లు మీద పడినా ఆకుకే నష్టం అన్న నానుడి ఇప్పటికీ అక్షర సత్యం అనిపిస్తోంది.

నాకు పెళ్లయి ఏడాది పూర్తయింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. కనీసం గర్భం కూడా దాల్చలేదు. దీనిని నాదే తప్పయినట్లు ఇంటి బయట జవాబులు చెప్పుకోవలసి వస్తున్నది.

కనిపించిన వారంతా పనిలేనట్లు నా గర్భం గూర్చే ప్రశ్నిస్తున్నారు. మా అత్తింటివారు నాకే ఏదో లోపం ఉన్నట్లు గుళ్లు గోపురాలు చుట్టమంటున్నారు. మా అమ్మ కూడా నన్నే తప్పు పడుతోంది.

మొండితనం లేకుండా భర్తను ఆకట్టుకోవాలని సూచిస్తోంది. నాతో పాటు పెళ్లయిన వారిలో చాలా మంది నెలల పిల్లలను ఎత్తుకుని తిరుగుతున్నారు.

దీంతో నా స్నేహితురాళ్లు నా పడకగది రహస్యాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భర్తను ఆకట్టుకోవడం ఎలా? అంటూ శిక్షణా కార్యక్రమాలు చేపట్టి బాధిస్తున్నారు.

నాకు ఒళ్లు మండి నా భర్తలో లోపం ఉందని చెప్పేయాలనిపిస్తుంది. పొరపాటుగా ఆ మాట బయటికి చెపితే మా ఆయన బజారు పాలవ్ఞతాడని భయపడి నాదే తప్పన్నట్లు సహిస్తున్నాను.

మా వారిని నిలదీసి మారమని చెపితే ఆయన మరింత బిగుసుకుపోతారనిపిస్తోంది. వారం క్రితం దాపరికం లేకుండా అన్ని విషయాలు మా అమ్మకు చెప్పాను.

నా భర్తలో సామర్ధ్యలోపం ఉందని ఏడాదిలో పట్టుమని పదిసార్లు కూడా నన్ను దగ్గరికి తీసుకోలేదని వివరించాను. దీంతో మా అమ్మ, మా అత్తమామలను కలసి చర్చిద్దామన్నది.

అన్ని విషయాలు తేల్చి చెప్పి రెండు మూడు నెలల్లో మార్పు రాకపోతే విడాకులు ఇచ్చేద్దామని అంటున్నది. దీంతో నాకు భయమేసింది.

అనవసరంగా సమస్యను జఠిలం చేసుకుంటే పరువు పోతుందని నచ్చచెప్పాను. నేనే చొరవతీసుకుని మా వారితో చర్చించి కౌన్సిలింగ్‌ తీసుకుందామని ఒప్పించాను.

ఆయన సమ్మతించారు. హోమియో లేదా ఆయుర్వేద చికిత్స తీసుకుందామని చెప్పారు. అయితే నా స్నేహితులు కొందరు కౌన్సిలింగ్‌ తీసుకుంటే చాలంటున్నారు.

కొందరేమో సెక్స్‌థెరపిస్టుకు చూపితే మంచిదని, ఇంకొందరు సైకియాట్రిస్టు లేదా న్యూరాలజిస్టుకు చూపితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎవరికి చూపాలో అర్ధం కాకుండా ఉంది. మా వారు బిటెక్‌ చదివి చెన్నైలో ఓ బహుళ జాతీయ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

నేను ఎంబిఎ పాసై ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. ఇద్దరం చెన్నైలోనే కాపురం ఉంటున్నాము. నా భర్త చాల మంచివారు. మెతక స్వభావి, కొంత బిడియస్తుడు. నన్ను బాగానే చూసుకుంటారు.

వారాంతాల్లో సరదాగా బయట తిప్పుతారు. అడిగినవన్నీ కొనిస్తారు. అయితే భర్తగా నన్ను దగ్గరికి తీసుకుని సుఖపెట్టలేకపోతున్నారు. ఎప్పుడైనా కలసినా సంతృప్తికరంగా ఉండటం లేదు. అతని వయసు 30. నా వయసు 28 సంవత్సరాలు. అతనికి ఇతర ఆరోగ్య సమస్యలు, అలవాట్లు లేవు. పని ఎక్కువగా ఉన్నప్పుడు నాతో కలిసినపుడు చాలా నీరసంగా ఉంటారు. కాబట్టి ఆయనను ఎవరి వద్దకు తీసుకెళితే మంచిది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – కృష్ణప్రశాంతి

అమ్మా! మీరు అందించిన వివరాల ప్రకారం మీ భర్తకు కౌన్సిలింగ్‌ సరిపోతుంది.

దీంతో పాటు శారీరక వ్యాయామాలు, సమతుల ఆహారం, ఒత్తిళ్లు నిర్వహణ ఉపయుక్తంగా ఉంటుంది. సహజంగా మానసికలోపాలే ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

భయం, సిగ్గు, బిడియం ఉన్నవారు తొలిరోజుల్లో భార్యతో చొరవగా వ్యవహరించలేరు. ఇలాంటి వారిలో పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ అంటే తమ సామర్ధ్యం పట్ల ఆందోళన ఉంటుంది.

ఈ ఆందోళన వల్ల వారు భార్యకు దగ్గర కాలేరు. అలాగే దగ్గరికి తీసుకోలేరు. అలాగే తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆసక్తి సన్నగిల్లి సామర్ధ్యం తగ్గుతుంది.

కొంతమందిలో నైతిక విలువలు, సెంటిమెంట్ల ప్రభావం కూడా ఉంటుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు. కొద్దిమందిలో నాడీ సమస్యలు తలెత్తి సామర్థ్యం తగ్గుతుంది.

తీవ్రమైన వ్యసనాలు, రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక రుగ్మతల వల్ల కూడా దాంపత్యలోపాలు తలెత్తుతాయి.

మానసిక పరమైన సమస్యలకు సైకాలజిస్టు ద్వారా కౌన్సిలింగ్‌ చేయిస్తే సరిపోతుంది.

బిహేవియర్‌ థెరపి, రిలాక్సేషన్‌ పద్దతులు, స్వీయ సమ్మోహనం తదితర పద్దతుల ద్వారా వారిలో ఆత్మవిశ్వసం పెంచుతారు.

కౌన్సిలింగ్‌తో పాటు శారీరక వ్యాయామాలు, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. ఒత్తిళ్లు తగ్గించుకుంటే ఉత్సాహం కలుగుతుంది.

ఇవన్నీ కలిస్తే దాంపత్య జీవితం సుఖమయమవుతుంది.

కాగా స్త్రీలలో అండం విడుదలైన రోజు భార్యాభర్తలు కలిస్తేనే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. గైనకాలజిస్టును కలిస్తే దీనిపై అవగాహన కలిగిస్తారు.

మిగిలిన సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు మాత్రమే ఆయా వైద్య నిపుణులను కలవవలసి వస్తుంది. అయితే సైకాలజిస్టు బదులు సెక్స్‌ నిపుణులను కలిసినా మంచిదే.

కాగా మీ పడకగది విషయాలు అందరితో చర్చించడం అంత మంచిది కాదు. వారు అనవసరంగా మీ జీవితంపై బురదచల్లే అవకాశం ఉంది.

అలాగే అందరి సలహాలు అడగడం కంటే తెలిసీ తెలియని సలహాల వల్ల ఒక్కోసారి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.

మీ భర్త కౌన్సిలింగ్‌కు సమ్మతించారు కనుక ఈ విషయాలు అతని తల్లిదండ్రులకు చెప్పవలసిన అవసరం లేదు.

మీరిద్దరూ కలసి కౌన్సిలింగ్‌ తీసుకుంటే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/