ప్రధాని మోడి ర్యాలీకి పటిష్ఠ భద్రత

రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ

Narendra modi
Narendra modi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరసత్వ జాలలు చెలరేగుతున్న నేపథ్యంలో నేడు ఢిల్లీ ప్రధాని నరేంద్ర మోడి చేపట్టనున్న ర్యాలీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారీ బహిరంగ సభను ఈ నేపథ్యంలో నిర్వహించనున్నారు. కాగా ఈ సభకు రామ్‌లీలా మైదానం వేదిక కాగా భారీ ఎత్తున భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి ఇప్పటికే తెచ్చుకున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అంతేకాకుండా ఆందోళన కారులు ర్యాలీని అడ్డుకునే అవకాశం ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మైదానం చుట్టూ దాదాపు 5000 మంది ట్రాఫిక్‌ పోలీసులు మోహరించి ఉన్నారు. జాతీయ భద్రతా దళానికి చెందిన ప్రత్యేక యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌, యాంటీ డ్రోన్‌ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక మైదానంలో భద్రతకు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, సిఆర్‌పిఎఫ్‌ సహా ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన రెండు వేలకు పైగా భద్రతా సిబ్బంది ఉంటారని సమాచారం. ఈ సభకు వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే సభకు అనుమతించనున్నారని తెలిసింది. నగరంలో ఇప్పటికే ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉన్నాయి. సభ ముగిసే వరకు పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. అంతేకాకుండా ఎత్తైన భవనాలపై స్నైపర్‌ రైఫిళ్లతో బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/