విప్రో కొత్త సీఈవోగా థియర్రీ డెలాపోర్ట్

ముంబయి: టెక్ దిగ్గజం విప్రో కొత్త సీఈవో, ఎండీగా క్యాప్‌జెమినీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ థియర్రీ డెలాపోర్టును నియమించారు. కంపెనీకి ప్రస్తుత సీఈవో, ఎండీగా ఉన్న అబిదలై నీమ్చావ్లా పదవీకాలం జూన్ 1తో ముగియనుంది. దీంతో కొత్త సీఈవో, ఎండీగా డెలాపోర్ట్ ను విప్రో ఎంపికచేసింది. జూన్ 6న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో జూన్ 1 నుంచి 5వ తేదీవరకు కంపెనీ వ్యవహారాలను విప్రో లిమిటెడ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ చూడనున్నారు.
కంపెనీ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్న డెలాపోర్ట్ కు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్వాగతం పలికారు. అద్భుత నాయకత్వ లక్షణాలున్న ఆయన నేతృత్వంలో కంపెనీ మరింత అభివృద్ధిచెందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా డెలాపోర్ట్ గతంలో క్యాప్‌జెమినీ సీవోవోగా, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడిగా, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రటజిక్ బిజినెస్ యూనిట్, గ్లోబల్ సర్వీస్ లైన్స్ అధినేతగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు క్యాప్‌జెమినీతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్నది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/