గెలిస్తే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం

ముంబై X బెంగళూరు. అబుదాబిలో రాత్రి 7.30 నుంచి

గెలిస్తే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం
Mumbai Indias-Royal Challengers Bangalore

అబుదాబి : గెలిస్తే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖరారయ్యే మ్యాచ్‌లో బుధవారం ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరుసగా మూడో మ్యాచ్‌నుకూడా మిస్‌ కానున్నాడు.

ఇరు జట్లు 11 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేట్‌తో ముంబై అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరు మూడో స్థానంలో ఉంది.

నేటి మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత పొందుతారు.

రోహిత్‌ శర్మ గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ మంగళవార నెట్స్‌లో సాధన చేశాడు. బుధవారంనాటి మ్యాచ్‌లో పాల్గొనేది లేనిదీ మ్యాచ్‌ ముందుగానీ తెలియదు. రోహిత్‌ తుంటి గాయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

అందుకే సోమవారం ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన జట్లలో రోహిత్‌ పేరు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రోహిత్‌ గైర్హాజరులో కీరన్‌ పొల్లార్డ్‌ గత మ్యాచ్‌లో నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇక టాపార్డర్‌లో సౌరభ్‌ తివరి, ఇషాన్‌ కిషన్‌లపై భారం పడనున్నది. గత మ్యాచ్‌లో విఫలమైన క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు తమ బ్యాట్లకు పనిచెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది.

హార్దిక్‌ పాండ్యా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించి జాతీయ జట్టులో తన స్థానం ఖాయం చేసుకున్నాడు.

ఇక కీరన్‌ పొల్లార్డ్‌, కృనాల్‌ పాండ్యాలు ఫామ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌, బుమ్రా వికెట్ల వేటలో ముందంజలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటివరకు 33 వికెట్లు పంచుకున్నారు.

బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీ లయను అందుకోవడం శుభపరిణామం. ఇక అరోన్‌ ఫించ్‌, యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌, ఎబి డివిలియర్స్‌ పరుగులపంట పండిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వారి సక్సెస్‌పై జట్టు విజయం ఆధారపడి ఉంది.

మిడిలార్డర్‌లో క్రిస్‌ మోరిస్‌, మొయిన్‌ అలీ, గురుకీరత్‌ మాన్‌ నిలకడ ప్రదర్శించాల్సి ఉంది. కాగా వారి ప్రధాన బౌలర్‌ నవదీప్‌ సైనీ గాయపడడం వారి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది.

అతడు ఈ మ్యాచ్‌లో ఆడకపోతే క్రిస్‌ మోరిస్‌, మహ్మద్‌ సిరాజ్‌లు ఆ బాధ్యత చేపట్టాల్సి ఉంటుంది. ఇసురు ఉదాన అదనపు బలగం. స్పిన్నర్లు యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తమ సత్తా ప్రదర్శించేందుకు ఇదే అదను.

జట్లు : ముంబై ఇండియన్స్‌ –

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), ఇసాన్‌ కిషన్‌, క్వింటన్‌ డికాక్‌, సౌరభ్‌ తివారి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కీరన్‌ పొల్లార్డ్‌, కృనాల్‌ పాండ్యా, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా, నాథన్‌ కోల్టర్‌నీల్‌, రాహుల్‌ చాహర్‌, జేమ్స్‌ పాటిన్సన్‌.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు –

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అరోన్‌ ఫించ్‌, దేవదత్‌ పడిక్కల్‌, ఎబి డివిలియర్స్‌, గురుకీరత్‌ సింగ్‌, శివం దూబె, క్రిస్‌ మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైనీ, యజువేంద్ర చాహల్‌, ఇసురు ఉదాన, మొయిన్‌ అలీ, మహ్మద్‌ సిరాజ్‌.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/