పోరాడితేనే గెలుపు

మానసిక వికాసం

Happy

అమ్మాయిలు చదువులోను, వృత్తిలోను విజయవంతంగా రాణిస్తున్నారు. అసాధ్యమైన రంగాల్లో సైతం తమకు సాధ్యమని నిరూపిస్తున్నారు. ఇలా విజయవంతంగా ముందుకు సాగిపోతున్న ఆమెకు సామాజిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఎంత జీతం సంపాదిస్తున్నా పెళ్లి కావాలంటే కట్నకానుకలను ఇవ్వాల్సిందే. నేరుగా కట్నం అడగలేకపోయినా ఆస్తుల రూపంలో కోరుతున్నారు. ఆఫీసులో ఆమె బాస్‌ స్థాయిలో ఎదుగుతున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు.

కార్యాలయంలో ఆమె ఉన్నత పదవిలో, తన నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నా ఇంటికి రాగానే భర్త నుంచి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు కాచుకుని ఉంటాయి.

రోడ్డుపై ఒంటరిగా వెళ్తుంటే చాలు ఆకతాయి వెటకారపు మాటలు ఎదురవ్ఞతుంటాయి. ఇవన్నీ ఆమె ఉన్నతికి ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఇవాల్టి రోజుల్లో, ఉదయం లేస్తే పేపర్లలోను, టీవీల్లోనూ కనిపించే వార్తలు హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలే ఉంటున్నాయి.

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం, హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటనలు మనల్ని, సమాజాన్ని ఎంతగానో కదిలించిందనే చెప్పాలి.

నిజానికి టీవీల్లోగాని, పేపర్లలోగాని విపరీత దృశ్యాలను, ముఖ్యంగా రక్తపాతాలను అసలు చూపకూడదని ఇంటర్నేషనల్‌ లా చెపుతున్నా, మనం వాటిని పట్టించుకోం సరికదా, కనీసం ఆ చనిపోయిన వ్యక్తిపట్ల ఇసుమంత కూడా గౌరవం చూపలేం.

ఎందువల్ల అంటే, మనలో స్పందనలు తగ్గిపోయి ఉండాలి. లేక యెవరికో యేదో అయితే మనకేంటి అన్న భావం అయ్యుండచ్చు. కళ్లముందు ఆకతాయిలు ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే ఎంతమంది అడ్డుకుంటున్నారు?

ఆటో అంకుల్‌ నాతో అదోలా ఉంటున్నాడు అని స్కూలు పిల్లలు చెపుతుంటే ఎంతమంది ఆలకిస్తున్నారు? ట్రైన్‌లో ఎదురుగా కూర్చున్న ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికి వెళుతుందీ, అని అడిగిందెవరు?

చేతల సాయం అటుంచి, కనీసం మాట సాయం చేస్తున్నామా? ప్రక్కింటి వాళ్లతో, బస్సులో రోజూ ఎదురయ్యే తోటిప్రయాణికులతో రైల్లో రాత్రంతా కూడా ప్రయాణించే తోటి ప్రయాణికులతో మాట్లాడి ఎంతకాలమైందో ఒకసారి ఆలోచించండి.

భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులే అయినా, ఉద్యోగం నుండి వచ్చాక భర్త కాళ్లు చాపి టీవీ ముందు కూర్చుంటే, భార్య కొంగు బిగించి ఇంటి పనులు చెయ్యాలి. సామాజిక న్యాయం ఎక్కడ! ఇంటికి ఏ బంధువ్ఞలు వచ్చినా భార్యే శెలవ్ఞ పెట్టి చూసుకోవాలి. భర్తకు కుదరదు.

ఎందుకు కుదరదు అంటే జవాబుండదు. ఉద్యోగంలో భార్యకి ఏదైనా రిమార్క్‌ వస్తే, అదో తంటా! దానిమీద బోలెడు కామెంట్స్‌! రోడ్డుమీద వెళ్లే ఆడపిల్లల్లో తమ కూతుళ్లని, చెల్లెళ్లనీ, తోబుట్టువ్ఞలనీ చూసుకోలేని బ్రతుకు మనిషి బ్రతుకేనా! ఆలోచించండి.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/