ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ హరీశ్ రాజీనామా చేస్తారా?: మాణికం ఠాగూర్

ఇండియన్ టూరిస్ట్ మృతికి బాధ్యత వహిస్తూ పోర్చుగల్ ఆరోగ్య మంత్రి రాజీనామా చేశారన్న ఠాగూర్

will-telangana-health-minister-harish-rao-resign-asks-tpcc-incharge-manickam-tagore

న్యూఢిల్లీః నగర శివారు ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘గర్భవతి అయిన ఇండియన్ టూరిస్ట్ మరణానికి బాధ్యత వహిస్తూ పోర్చుగల్ దేశ ఆరోగ్య మంత్రి రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రభుత్వ డాక్టర్లు నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ అయి నలుగురు మహిళలు మృతి చెందారు. దీనికి బాధ్యత వహిస్తూ తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు రాజీనామా చేస్తారా?’ అని మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు.

మరోవైపు, ప్రైవేట్ కంపెనీలకు తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ అతి తక్కువ ధరలకు 2,500 ఎకరాల భూములను కట్టబెట్టిందని మాణికం ఠాగూర్ మరో ట్వీట్ లో మండిపడ్డారు. భూముల దందాతో కేసీఆర్ కుటుంబం కోట్లాది రూపాయలను వెనకేసుకుంటోందని విమర్శించారు. ఈ అవినీతి విషయంలో గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ దోపిడీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ముగింపు పలకాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/