పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం ?

సీఎం పదవికి రాజీనామా చేయమన్న సోనియా.. పార్టీ నుంచే వెళ్లిపోతానన్న అమరీందర్ సింగ్​!


న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ లో వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, కెప్టెన్ కూడా అధిష్ఠానానికి అంతే దీటుగా బదులిచ్చినట్టు సమాచారం.

ఇవాళ ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అమరీందర్ ఫోన్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని, పార్టీ నుంచి వెళ్లిపోతానని ఆమెకు చెప్పారని అంటున్నాయి. కాగా, పార్టీలోని ఓ వర్గం ఎమ్మెల్యేల లేఖతో ఇవాళ సాయంత్రం సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. అయినా కూడా వివాదాలు మరింత ముదిరాయే తప్ప చల్లారలేదు. ఈ క్రమంలోనే సోనియాకు ఆయన ఫోన్ చేశారని, ఆమె రాజీనామా చేయాల్సిందిగా సూచించారని అంటున్నాయి. ఇటు అమరీందర్ కూడా తన వర్గం ఎమ్మెల్యేలతో తన నివాసంలో ఇప్పటికే భేటీ అయ్యారని, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా, అమరీందర్ రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ముఖ్యమంత్రి అమరీందర్ కు అత్యంత సన్నిహితుడు, పీసీసీ మాజీ చీఫ్ అయిన సునీల్ జఖార్ పేరు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రాహుల్ గాంధీని పొగుడుతూ ట్వీట్ కూడా చేశారు. పంజాబ్ కాంగ్రెస్ లో సమస్య పరిష్కారం కోసం రాహుల్ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం చూసి అకాలీల వెన్నులో వణుకుపుడుతోందని సునీల్ జఖార్ ట్వీట్ చేశారు.

కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తితో ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎల్పీ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్ చార్జ్ హరీశ్ రావత్ ప్రకటించారు. ఎమ్మెల్యేలంతా సాయంత్రం 5 గంటలకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీసుకు రావాలని ఆదేశించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/