చీరకట్టులో ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్?

భారతీయ సంస్కృతి, వారసత్వంపై ఎనలేని ప్రేమ

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ప్రమాణస్వీకారానికి ఎలా వెళ్లనున్నారు? ఇప్పుడీ ప్రశ్న అందరి నోళ్లలోనూ నానుతోంది. భారతీయ మూలాలున్న ఆమె రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. భారతీయ అమెరికన్ అయిన కమల.. సంప్రదాయ చీరకట్టులో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. భారతీయ సంస్కృతి, వారసత్వంపై తనకు అమితమైన గౌరవం ఉందని, తన తల్లి తనను అలా పెంచారని కమల పలుమార్లు వెల్లడించారు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా తాము అన్ని పండుగలను జరుపుకుంటామన్నారు.

కమల తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి పెరిగారు. అనంతరం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. అయినప్పటికీ భారతీయ సంప్రదాలను ఆమె ఏనాడూ విడిచిపెట్టలేదు. కమలకు కూడా చిన్ననాటి నుంచే వాటిని నేర్పించారు. ప్రమాణ స్వీకార సమయంలో ఆమె బెనారస్ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బిబు మొహాపాత్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/