అధిష్టానం ఆదేశిస్తే తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తా – జయప్రద

బిజెపి నాయకురాలు , మాజీ ఎంపీ జయప్రద తన మనసులోని కోరికను బయటపెట్టింది. అధిష్టానం ఆదేశిస్తే తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని తెలిపింది. సోమవారం ఆమె హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు. స్వతహాగా తెలుగు మహిళను అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని తెలిపింది. మరి జయప్రద కోరిక బిజెపి అధిష్టానం తీరుస్తుందా అనేది చూడాలి.

జయప్రద విషయానికి వస్తే..1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ, బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.

నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశము పార్టీ యొక్క మహిళా విభాగమునకు అధ్యక్షురాలైనది. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైనది. ప్రస్తుతం బిజెపి లో కొనసాగుతుంది.