నా ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు అణచి వేస్తున్నారు: షర్మిల

పోలీస్ డిపార్ట్ మెంట్ పై ప్రైవేట్ కేసు వేస్తున్నా.. షర్మిల

will-file-a-private-case-against-police-department-says-ys-sharmila

హైదరాబాద్‌ః ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న తనను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద వదిలేశారని… ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లో దిగ్బంధించారని వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. అడుగు బయట పెట్టకుండా దిగ్భంధం చేశారని చెప్పారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తనను కోర్టు వద్దకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి కెసిఆర్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలీసులపై పై నుంచి ఒత్తిడి ఉందని తాను పదేపదే అనుకుంటున్నా… పరిస్థితి దిగజారుతోందని అన్నారు. పోలీసులను కెసిఆర్ కీలుబొమ్మలుగా వాడుకుంటోందని చెప్పారు. అందుకే పోలీసులపైనే కేసు పెట్టబోతున్నామని అన్నారు. తన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు అణచి వేస్తున్నారని అందుకే పోలీసులపై ప్రైవేటు కేసు వేయబోతున్నానని చెప్పారు.

తన ఇంటి వద్దకు మీడియాను కూడా రానివ్వడం లేదనే విషయం తనకు తెలిసిందని షర్మిల అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తమ కార్యాలయానికి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యకర్తలకు ఇలాంది దుస్థితి లేదని అన్నారు. పక్కనే టిఆర్ఎస్ కార్యాలయం ఉందని… ఇప్పుటికే ఆ పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించి, బందిపోట్ల రాష్ట్ర సమితి అనే పేరు పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణను దోచుకోవడం అయిపోయిందని… అందుకే కెసిఆర్ దేశం మీద పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థ మొత్తం కెసిఆర్ ఆధీనంలోకి వెళ్లిపోయిందని, కనీసం న్యాయ వ్యవస్థ బతికున్నందుకు సంతోషమని చెప్పారు.

తన పాదయాత్రకు హైకోర్టు మరోసారి అనుమతి ఇచ్చిందని… కెసిఆర్ ఇప్పటికైనా కోర్టును గౌరవించి పాదయాత్రకు అడ్డంకులు కలిగించకూడదని అన్నారు. తన పాదయాత్ర చివరి దశకు చేరుకుందని… పాదయాత్రను ఎక్కడైతే ఆపామో, సంక్రాంతి తర్వాత అక్కడి నుంచే యాత్రను ప్రారంభిస్తామని చెప్పారు. నిరాహారదీక్ష వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నదని… రోజుకు 20 కిలోమీటర్లు నడిచే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పారని… అందుకే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. రైతుల ద్రోహి కెసిఆర్… ఇప్పుడు కిసాన్ కా సర్కార్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. వరి వేసుకుంటే ఉరే అన్న కెసిఆర్, కౌలు రైతులను రైతులుగానే గుర్తించని కెసిఆర్… రైతు ద్రోహి కాదా? అని ప్రశ్నించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/