వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుండి పోటీః వీవీ లక్ష్మీనారాయణ

అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్న సీబీఐ మాజీ జేడీ

will-contest-from-visakhapatnam-says-vv-laxminarayana

అమరావతిః సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి పోటీ చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని అన్నారు. అలాగే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా తనవంతు కృషి చేస్తానని అన్నారు. 1980వ సంవత్సరంలో వావిలాల గోపాలకృష్ణయ్య చేపట్టిన పైసా ఉద్యమ స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ. 100 ఇస్తే రూ. 850 కోట్లు అవుతుందని, ఇలా నాలుగు నెలలపాటు నిధులు సేకరిస్తే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి స్టీల్‌ప్లాంట్ వెళ్లకుండా అడ్డుకోవచ్చని లక్ష్మీనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.