మళ్లీ లక్ష్మణ్‌కే బిజెపి పగ్గాలు?

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత అధికారిక ప్రకటన

Laxman
Laxman

హైదరాబాద్‌: బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా మళ్లీ లక్ష్మణ్‌ కు అవకాశం దక్కేలా కనిపిస్తుంది. అయితే లక్ష్మణ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు గడుస్తున్న విషయం తెలిసిందే. బిజెపి రాజ్యాంగం ప్రకారం మూడేళ్లు దాటితే అధ్యక్షుడిని మార్చాల్సి ఉంటుంది. కానీ ఆయన పనితీరుపై సంతృప్తి చెందిన అధిష్టానం తిరిగి ఆయనే మళ్లీ అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు ఉండడంతో అవి ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు కీలక సమాచారం. అయితే ఈ అధ్యక్ష పదవికి పలువురు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నది తెలిసిన విషయమే. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి వచ్చిన డికె అరుణకు పార్టీ పగ్గాలు దక్కనున్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే ఎంపి బండి సంజయ్, సీనియర్‌ నేతలు చింతల రామచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, యెండెల లక్ష్మీనారాయణ తదితరుల పేర్లను కూడా అధిష్టానం పరిశీలించినట్లు వార్తలు వినిపించాయి. అయితే కొత్త వారిని నియమించినంత మాత్రాన పార్టీకి ప్రత్యేకంగా చేకూరే ప్రయోజనం ఏమి లేదని అర్థమయిన అధిష్టానం పెద్దలు చివరికి లక్ష్మణ్‌కే మరో మారు పగ్గాలు అప్పగించాలని దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/