అమలు చేయలేని చట్టాలెందుకు?

Law
Law

రోజామొక్కకు ముళ్లు,మొగ్గలుంటాయి. ముళ్లు గుచ్చుకున్నప్పుడు నొప్పి కలుగుతుంది. మొగ్గలు లభ్యమైనప్పుడు ముఖం వికసిస్తుంది. ఈ వికారవికాసాలు ఆయా వ్యక్తుల మనోభావాలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం చేసే చట్టాలు కొందరికి బాధ కలిగించవచ్చు. మరికొంద రికి ఎంతో ఊరట కలిగించవచ్చు. పాలకులు ఇలాంటి విషయాల్లో సమగ్రమైన అధ్యయనం చేసి తాము చేసే చట్టాల వల్ల ఎవరికి ఉపయోగం? మరెవరికి నష్టం? నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలి?అమలులో సాధక బాధకాలు, సాధ్యాసాధ్యాలు అసలు ఆ చట్టం అమలు చేసే సామర్థ్యం అందుకు తగిన సిబ్బంది ఉందా? తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి చట్టం చేయాలి.

పొగాకు విషయంలో పాలకులు అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమనాలకు దారితీస్తున్నది. ఎలాంటి అధ్యయ నాలు, సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండానే చట్టాలు చేస్తున్నారనే విమర్శలను కొట్టిపారేయలేం. వాస్తవానికి మద్యపానం, ధూమపానం రెండూ మానవ జాతిని పట్టిపీడిస్తున్న రెండు భూతాలు. ఒకటి బ్రహ్మరాక్షసి అయితే, మరొకటి పిశాచి. ఇందులో మరో వాదనకు తావ్ఞలేదు. మద్యపానాన్ని పెంచిపోషిస్తూ ఆదాయ వనరుగా మలుచుకుంటున్న పాలకులు ధూమ పానం విషయంలో ఏదో కొంత చర్యలు తీసుకుంటు న్నట్లు కన్పించడం, కొంతలో కొంత నయమని చెప్పొ చ్చు. ఊపిరితిత్తుల కేన్సర్‌, మరెన్నో రోగాలకు ధూమ పానం కేంద్ర బిందువని ఎందరో వైద్యనిపుణుల అధ్యయనంలో తేలింది.

ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికిపైగా ధూమపానంలో మునిగి తేలుతున్నారు. భారతదేశానికి సంబంధించి దాదాపు 20 కోట్ల మంది పొగాకుకు అలవాటుపడ్డారు. ఇందులో బీడీలు తాగేవారే ఎక్కువ మంది ఉన్నారు. బీడీలు, సిగరెట్లు తాగడం సరదాగా ఆరంభమై ఆ తర్వాత అలవాటుగా మారిపోతు న్నది. పదిహేనేళ్ల వయస్సులోనే ఇది ఆరంభం కావడం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇందువల్ల వివిధ రోగాలబారిన పడుతుంటే లక్షలాది మంది అసువ్ఞలు బాస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ధూమపానం మానవ ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతున్నదనే విషయం అనేక అధ్యయనాల్లో వెల్ల డైంది.

కేవలం పొగాకు వినియోగం కారణంగా ఆగ్నేయా సియాలో గంటకు 150 మంది వరకు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ గతంలో వెల్లడించింది. పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి డిజైన్‌లు వంటి ఆర్భాటాలు లేకుండా మామూలు ప్యాకింగ్‌ రూపంలో జరపాలని సూచించింది. పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్యకరమైన హెచ్చరికలు, చిత్రాలతోపాటు తయారు చేసిన కంపెనీ పేరు, ఉత్పత్తి పేరు నిర్ణీత పరిణామంలో ముద్రించాలని కూడా సూచించింది. ఇలాంటి ఎన్నో సూచనలు చేస్తున్నా, చట్టాలు చేస్తున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పురావడం లేదు.

ఆగ్నేయాసియాలోని 11 దేశాల్లో 24కోట్ల మందికి పైగా ధూమపానంలో మునిగితేలుతుండగా 29 కోట్ల మంది పొగాకును ధూమపానేతర ఉత్పత్తుల్లో ఉపయోగి స్తున్నారు. భారతదేశానికి సంబంధించి కూడా వినియో గం పెరిగిపోతున్నది. సిగరెట్‌ పొగలో నాలుగువేల ఎనిమిది వందలకుపైగా ప్రమాదకర విషవాయువ్ఞలు ఉన్నాయని గుర్తించారు. ఇవి అనేక రోగాలకు మూలమ వ్ఞతున్నాయని డాక్టర్లే వెల్లడించారు. ప్రాణాంతక పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 2003 నుంచే చర్యలు ప్రారంభించారు.

అప్పుడు తెచ్చిన చట్టం బహిరంగ ధూమపానాన్ని నిషేధించడంతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా పొగాకు వినియోగానికి సంబంధించిన ప్రకటనలను నిలిపివేశారు. వీటి ఫలితంగా 2010 నాటికే ధూమపానం చేసేవారి సంఖ్య భారత్‌లో ఆరుశాతం తగ్గిందని లెక్కలు చెప్పుకు న్నారు. కానీ అనధికార లెక్కలను బట్టి చూస్తే నేటికీ ముప్ఫైకోట్ల మందికిపైగా ఈ పొగాకు వ్యసనంతో చితికి పోతున్నారు. ధూమపానాన్ని వదిలివేసినా దాని ప్రభావం మూడుదశాబ్దాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. ఇన్ని అనర్థాలకు మూలమైన పొగాకు వినియో గాన్ని నియంత్రించేందుకు తీసుకువచ్చిన చట్టాన్ని ఒకటి న్నర దశాబ్దం దాటిపోయినా అమలుకు నోచుకోవడం లేదు.

అసలు ఈ చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగం కూడా లేదు. ఒక వ్యవస్థే లేదనిచెప్పొచ్చు. మరొకపక్క దేశవ్యాప్తంగా ఏటా దాదాపు నలభైవేల కోట్ల రూపాయలకుపైగా పొగాకు వ్యాపారం జరుగుతున్నది. పొగాకు ఉత్పత్తులపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మరెన్నో లక్షల మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి ఉన్నారు. రైతులతోపాటు మరెంతో మంది రైతుకూలీలు దీనిపై ఆధారపడి ఉన్నారు.

ఆ కుటుంబాలు వీధిపాలు కాకుండా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించకుండా కాగితాలపై చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. ఆదాయం కోసం ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తూ మరొకపక్క నిషేధించడం ఎంతవరకు సమంజసం.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవనోపాధి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపి పొగాకు ఉత్పత్తులను, అమ్మకాలను, వినియోగాన్ని భూటాన్‌ దేశంలో లాగా పూర్తిగా నిషేధించాలి. అప్పుడే ధూమపానానికి కొంతవరకైనా ఫుల్‌స్టాప్‌ పెట్టించిన వారవ్ఞతారు. అంతేకానీ అమలు చేయలేని, ఆచరణ సాధ్యం కాని చట్టాలను చేస్తే ప్రభుత్వం నవ్వుల పాలవుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/