రాష్ట్ర విభజనపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదు : ఉండవల్లి

కేంద్రానికి జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు: ఉండవల్లి

అమరావతి: కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఏపీని విడగొట్టాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విభజన వల్ల ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పారు. చర్చ లేకుండానే విభజన బిల్లును ఆమోదించారని, రాజధాని లేకుండానే ఒక రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై వైస్సార్సీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై పోరాడాలని హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఏపీ అంటే కేంద్ర ప్రభుత్వానికి అంత అలుసా? అని ప్రశ్నించారు. రోబోయే రోజుల్లో ఏపీని అసలు పట్టించుకోరని అన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏపీలో కరెంట్ కోతలపై ఉండవల్లి స్పందిస్తూ… ఫిబ్రవరిలోనే విద్యుత్ కోతలు ఉంటే… వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/