ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ఆదుకునేదెవరు?

జీతాలు లేక ఆరు నెలలుగా ఆయా కుటుంబాలు ఇబ్బందులు

private teacher in class room
private teacher in class room

కరోనా… ప్రైవేట్‌ ఉద్యోగస్తుల, బోధకుల జీవితాల్లో చీకట్లు చిమ్మింది. బతుకులను బజారుకీడ్చింది. పొట్టగడవని పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే డొక్కాడని ప్రైవేట్‌ ఉపాధ్యా యులు, లెక్చరర్లు తెలుగు రాష్ట్రాల్లో చావలేక, బతకలేక, జీవచ్ఛవంలా మారిపోయారు.

ఎనిమిది నెలలు గడిచినా నయాపైసా ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించలేక బతుకు నావను నడపలేక అన్నమో రామచంద్ర గత మార్చి నుండి ప్రతి నెల కనీసం సగం జీతం అయినా ఇవ్వా లని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా, విజ్ఞప్తి చేసినా వారి కష్టాలు, కన్నీళ్లు తీరలేదు.

తెలుగు రాష్ట్రాల్లో పొట్టగడవక పస్తులుండి సుమారు నాలుగువేల మంది ప్రైవేట్‌ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి సేవలు వాడుకున్న ప్రైవేట్‌ పాఠశాలల మేనేజ్‌మెంట్‌ కనీస సహకారం అందించకుండా ప్రైవేట్‌ ఉపాధ్యాయులను నడిబజార్లకు నెట్టేశాయి.

తరగతి గదిలో పాఠాలు బోధిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నేడు కూలి పనిచేస్తూ, ఆటో నడుపుతూ పొట్ట నింపుకునే దుస్థితి నెలకొంది. జిల్లాల్లోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లల్లో పనిచేసిన ఉపాధ్యాయుల బతుకు చిత్రం కరోనా లాక్‌డౌన్‌ పేరుతో పూర్తిగా మారిపోయింది.

రోజు గడవడమే కష్టంగా తయారైంది. ఆరు నెలలుగా ఆయా కుటుంబాలు పడు న్న ఇబ్బందులు వర్ణనాతీతం. జిల్లాలో మొత్తం 950 వరకు కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ఉన్నాయి. దాదాపు 3,500 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

మార్చి 23న లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఉపాధ్యాయులకు యాజమాన్యాలు జీతాలివ్వకుండా నిలిపివేశాయి. మార్చి తర్వాత స్కూళ్లు జరిగే కాలం తక్కువే. జూన్‌ వరకూ వేసవి సెలవులు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఆ కాలానికి కూడా జీతాలు ఇచ్చే ఒప్పందంపైనే ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పని చేస్తారు.కరోనా సాకుతో కార్పొరేట్‌, ప్రైవేట్‌స్కూళ్లు యాజమా న్యాలు మొత్తం జీతాలు ఎగ్గొటేశాయి.

ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారం భమైన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న ఫీజు బకాయిల్లో 90 శాతం సొమ్మును యాజమాన్యాలు వసూలు చేశాయి. పాత ఫీజు కట్టకపోతే ఆన్‌లైన్‌పాఠాలు చెప్పడం కుదరదని, పాత ఫీజులతోపాటు కొత్త ఫీజులు వసూలు చేశారు.

అయినప్పటికీ అక్కడ పని చేసే ఉపాధ్యాయులకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. ఒకటి, అర, చిన్న స్కూళ్లు ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. బడా స్కూళ్లుగా పేరొంది రూ.వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లు విద్యార్థుల నుండి ఫీజు బకాయిల వసూళ్లను దాదాపుగా పూర్తి చేశాయి.

కేవలం సబ్జెక్ట్‌ టీచర్లతో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ వారికి పూర్తి జీతం ఇవ్వని పరిస్థితి కొనసాగుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యా యులకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలు కాని దుస్థితి నెలకొంది.

కరోనా సాకుతో ఉపాధ్యా యులకు జీతాలు ఎగనామం పెట్టి కార్పొరేట్‌ స్కూళ్లు తమ జేబులు నింపుకున్నాయి. నిన్నటివరకూ క్లాసుల్లో పాఠశాలు చెప్పే ఉపాధ్యాయులు నేడు రోడ్డున పడి బతుకుతెరువ్ఞ కోసం నానా తిప్పలు పడాల్సిన దుస్థితి దాపురించింది.

ఎం.ఎ, ఎంయస్‌సి చదివిన ఉపాధ్యాయులు కూలిపనిచేస్తూ, ఆటోలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే దుస్థితి నెలకొంది. తమకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదని చాలా మంది ఉపాధ్యాయులు అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది.

యాజమాన్యాలకు నోటీసులిచ్చి మమ అనిపించారే తప్ప ఏమాత్రం న్యాయం చేయలేదు. పైగా కార్పొరేట్‌ స్కూళ్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకొని పైవేట్‌ ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

చట్టప్రకారం ప్రైవేట్‌ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు 12 నెలలు జీతం ఇవ్వాలి. అర్థాంతరంగా ఉద్యోగం నుంచి తీసివేయడం చట్టప్రకారం చెల్లదు.

అలా చేసిన స్కూళ్లపై అధికారులు రెండు నెలలు శిక్ష విధించే అవకాశం చట్టంలో ఉంది. అయితే కేవలం షోకాజ్‌ నోటీసులు ఇచ్చి మమ అనిపించారు. ఇప్పటికే ఆరు నెలలయింది. ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలి.

  • రావుల రాజేశం

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/