చైనా కాదు..మా ఆఫీసే హెచ్చరించింది

వైరస్‌పై ముందుగా హెచ్చరించింది చైనాలోని తమ కార్యాలయం: డబ్ల్యూహెచ్ఓ

WHO

జెనీవా: వుహాన్‌లో అల్ల‌క‌ల్లోలం సృష్టించిన కరోనా వైరస్‌ గురించి తొలుత చైనా వెల్ల‌డించ‌లేద‌ని, ఆ దేశంలో ఉన్న మా సంస్థ ఆఫీసు నుంచి తొలి హెచ్చ‌రిక వ‌చ్చిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. వైర‌స్ నియంత్ర‌ణ‌లో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైన‌ట్లు అగ్ర‌రాజ్యం అమెరికా ఆరోపిస్తున్న నేప‌థ్యంలో.. ఆ సంస్థ ఈ ర‌కంగా స్పందించింది.

వైరల్ న్యుమోనియా కేసులను గుర్తించినట్టు వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్‌సైట్‌లో డిసెంబరు 31న ప్రకటించిన తర్వాత చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ కార్యాలయం నుంచి తమకు సమాచారం వచ్చినట్టు పేర్కొంది. అలాగే అదే రోజు, అమెరికాలోని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఎపిడిమియోలాజికల్ నిఘా నెట్‌వర్క్ ప్రోమెడ్ సైతం వుహాన్‌లో అంతుచిక్కని కారణాల వల్ల న్యుమోనియా కేసులు బయటపడినట్టు వెల్లడించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కొత్తరకం వైరస్ కేసుల గురించి ఈ ఏడాది జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరితే, జనవరి 3న సమాచారం అందజేశారని వెల్లడించింది. చైనా పట్ల తమకు ఎలాంటి ఆశ్రిత పక్షపాత ధోరణి లేదని మరోసారి స్పష్టం చేసింది.

డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక సంఘటనను అధికారికంగా ధ్రువీకరించడానికి, దాని స్వభావం లేదా కారణం గురించి అదనపు సమాచారాన్ని అందజేయడానికి దేశాలకు 2448 గంటలు సమయం ఉంటుందన్నారు. తమ నివేదికను ధ్రువీకరించమని కోరిన వెంటనే చైనా అధికారులు డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించారని ర్యాన్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ ఏప్రిల్ 9న పేర్కొన్న వివరాల ప్రకారం.. హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను డిసెంబర్ 31న వుహాన్ మున్సిపల్ ఆరోగ్య కమిషన్ గుర్తించినట్టు తెలిపింది. చైనా నుంచి తొలి నివేదిక వచ్చిందని ఏప్రిల్ 20న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే, ఎవరు తెలియజేశారో మాత్రం డబ్ల్యూహెచ్ఓ పేర్కొనలేదు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/