కాబోయే రాష్ట్రపతి ఎవరు?

‘వార్తల్లోని వ్యక్తి’ ప్రతి సోమవారం

Vice President Venkaiah Naidu
Vice President Venkaiah Naidu

ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవితం విలక్షణమైనది… పసిబిడ్డను ఎత్తుకున్న ఆ తల్లి డొక్కలో పొడుచుకున్న గేదెకొమ్ము బిడ్డకు కూడా తగిలివుంటే, దేశం ఒక మహాపురుషుని కోల్పోయి ఉండేది!

ఆయన ప్రయాణిస్తున్న విమానాలు కాని, హెలికాప్టర్లు కాని ఆకాశం మధ్యలోనే దాదాపు 10,12 సార్లు సాంకేతిక వైఫల్యాల వల్ల బలవంతంగా కిందకు దిగవలసి వచ్చింది.

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన మేనమామ పెంపకంలో పెరిగారు. లాయర్‌ డిగ్రీ సాధించినా, కోర్టులకు వెళ్లలేదు. ప్రజాకోర్టులే ఆయన ‘లా కోర్టులు!

ప్రజాకోర్టులలో ఆయన వాగ్ధాటికి ఎంతటి ఉద్దండులైన ప్రత్యర్థులైనా నిరుత్తరులే!

ఆయన వేదిక ఎక్కితే, వెయ్యి తుపాకుల పెట్టు! ఆయన ఉపన్యాసం ఉన్నదని తెలిస్తే, ఏపాటి రాజకీయ వాసన, తెలుగు భాషాప్రియత్వం ఉన్నా వినడానికి విరగబడతారు.

వాగ్ధాటిలో ఆయనకు ఆయనే సాటి! వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు, హాస్యోక్తులతో ముఖ్యంగా అంత్యప్రాసలతో ప్రసంగిస్తూ వ్ఞంటే, పండితులు, పామరులు గంటల తరబడి వింటారు.

వాక్చాతుర్యం ఆయన పాశుపతాస్త్రం, వ్యంగ్యవైభవం ఆయన గాండీవం!

2002 జులై 1వ తేదీన బిజెపి పగ్గాలను చేబూనుతూ ఆయన తన కర్తవ్యాన్ని సూచిస్తూ ‘ఒకచేతిలో బి.జె.పి జెండా, మరో చేతిలో ఎన్‌.డి.ఏ ఎజెండాతో పనిచేస్తానంటూ ఆయన బిజెపి, ఎజెండాలను ఒకే త్రాసులో సమానంగా చూపించారు.

మరోసారి ఆయన ఇంగ్లీషులో ‘బుచర్స్‌కెనాట్‌ బి బుచర్స్‌ అని కాంగ్రెసును ఎద్దేవా చేశారు.

అంటే, కసాయివారు నీతి బోధకులు కాలేరని తాత్పర్యం! ఆయన అంత్యప్రాసలు, పదబంధాలు ప్రత్యర్థుల పెదవ్ఞలపై కూడా చిరునవ్వులు చిందిస్తాయి!

ఆంధ్ర డెమోస్తనీస్‌:

ప్రాచీన గ్రీస్‌ దేశంలో డెమోస్తనీస్‌ అనే మహావక్తవ్ఞండేవారు. ఆయనకు బాల్యంలో నత్తిఉండేది! కాని, స్వయంకృషితో, సాధనతో ఆయన ప్రపంచంలోనే మహావక్తగా పేరు పొందారు.

వెంకయ్యనాయుడుగారిని ‘ఆంధ్ర డెమోస్తనీస్‌ అని వ్యవహరించవచ్చు!

ఫలించిన నా సూచన:

ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇక్కడ పేర్కొనవలసి ఉంది. ఆ మధ్య వెంకయ్య నాయుడు ఒక కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నాలుగైదు సభలలో ప్రసంగించారు.

ఆ సభలన్నింటిలో నేను కూడా ఉపన్యాసకుణ్ణి.

2016 సెప్టెంబర్‌ 17న జరిగిన సభలో నేను మాట్లాడుతూ త్వరలో ‘ఖాళీ’ కానున్న ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు గారిని ఎంపిక చేయవలసిందిగా సభవారి హర్షధ్వానాల మధ్య ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను..అన్నాను.

సభాసదులు ఆమోదసూచకంగా హర్షధ్వానాలు చేశారు.

‘నేను ఉషాపతినే’:

ఆ తరువాత ముఖ్యఅతిధిగా చివర మాట్లాడిన వెంకయ్యనాయుడు ‘నేను ఉషాపతినే నాకు ఉపరాష్ట్రపతి, ఏ రాష్ట్రపతి, పతీ అక్కర్లేదు అంటూ ప్రసంగించారు. ‘ఉష ఆయన సతీమణి నామధేయమని చెప్పనక్కరలేదు.

‘ఉషాపరిణయం (1971 తరువాతనే ఈ అనిరుద్ధుడని పదవ్ఞలు కోరకుండానే అవే వరిస్తున్నాయి) ఆయన ఈ సభాసూక్తి చివరకు ప్రధాని మోడీ దృష్టికి కూడా వెళ్లింది!

‘విూరు క్రియాశీల రాజకీయాలలో వ్ఞంటానని పదేపదే అంటున్నా, ఉపరాష్ట్రపతి పదవికి మిమ్మల్ని మించి అర్హులెవ్వరూ ఇప్పుడులేరు!

నా మాటవిని, విూరు ఉపరాష్ట్రపతి పదవికి దయతో అంగీకరించండి అని సాక్షాత్తు ప్రధాన మంత్రి అనునయపూర్వకంగా అడిగినప్పుడు కాదనగలరా?

కాగా, 2017 జులై 29న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్‌.డి.ఏ. అభ్యర్థి అయిన తరువాత వెంకయ్యగారికి విజయవాడలో ఆత్మీయ సత్కారం జరిగింది.

2016 సెప్టెంబర్‌లో అదే వేదికపై నేను మాట్లాడినప్పుడు వెంకయ్య నాయుడు గారిని మొదటిసారిగా ఉపరాష్ట్రపతి పదవికి సూచించిన నన్నే మాట్లాడమన్నారు.

నేను-‘2022లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు గారినే రాష్ట్రపతి కాగలరని ఆశీర్వదించాను! (నా కంటే ఆయన దాదాపు 20 సంవత్సరాలు పిన్నవయస్కులు)

సభలో ఉన్న మేధావులు, అధికారులు, మంత్రులు, ఎమ్‌.పి.లు, బిజెపి పెద్దలెందరో వున్న ఆ సభాభవనం హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది!

కాగా, మొన్న 2020 జులై 1వ తేదీన నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనకు లేఖ రాశాను.తథాస్తు!

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ ‘అవార్డు గ్రహీత)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/