ది వారియర్ నుండి విజిల్ సాంగ్ రిలీజ్..చూస్తే విజిల్ వేయాల్సిందే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి విజిల్ సాంగ్ వచ్చింది. ఇప్పటికే పలు సాంగ్స్ విడుదలై శ్రోతలను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా..ఇక ఈరోజు బుధువారం చిత్రంలోని మాస్ సాంగ్ విజిల్ ను విడుదల చేసి..ప్రేక్షకుల చేత విజిల్ వేయించారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా విజిల్ పాటను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నాలికిట్టా మడతపెట్టి.. వేళ్లు రెండు జంట కట్టి.. ఊదు మరి ధమ్మే బట్టి.. విజిల్.. విజిల్.. విజిల్’ అంటూ సాగిన ఈ సాంగ్ మాస్ ని విపరీతంగా అలరిస్తోంది.

ఇందులో రామ్ పోతినేని మాస్ లుక్స్ మరియు అతని డ్యాన్స్ మూవ్స్ ఆకట్టుకుంటున్నాయి. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. కృతి శెట్టి కూడా రామ్ తో పోటీగా కాలు కదపడానికి ట్రై చేసింది. కృతి శెట్టితో రాపో వేసిన హుక్ స్టెప్స్ మాస్ ని అలరిస్తోంది. విజువల్ గానూ ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ కు ఆంథోనీ దాసన్ మరియు శ్రీనిషా జయ సీలన్ వాయిస్ అదనపు అసెట్ గా నిలిచింది. సాహితీ ట్యూన్ కు తగ్గట్టుగా లిరిక్స్ అందించింది.

ఇక ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనుండగా.. అక్షర గౌడ కీలక పాత్ర పోషించింది. నదియా – నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక మీరు కూడా ఈ విజిల్ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.