క్రికెట్‌లో చెత్త రికార్డ్‌.. ఒకే ఓవర్‌లో 77 పరుగులు

One Over-77 Runs an unrecorded bowling action
One Over-77 Runs an unrecorded bowling action

వెల్లింగ్టన్‌: 1990 ఫిబ్రవరి 20న న్యూజిలాండ్‌లోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 77 పరుగులు నమోదయిన ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వెల్లింగ్టన్‌, కాంటర్‌బరీ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. వెల్లింగ్టన్‌ టైటిల్‌ సాధించాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి అది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో కాంటర్‌బరీకి వెల్లింగ్టన్‌ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కాంటర్‌బరీ 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయింది. క్రీజులో ఎల్‌కే జర్మన్‌ (160 నాటౌట్‌), రోజర్‌ ఫోర్డ్‌ (14 నాటౌట్‌) ఉన్నారు. ఇక కాంటర్‌బరీ గెలవడానికి 2 ఓవర్లలో 95 పరుగులు చేయాలి. అది అసాధ్యం అయినప్పటికీ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని జర్మన్‌, ఫోర్డ్‌ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు 2 ఓవర్లలో రెండు వికెట్లు తీస్తే.. వెల్లింగ్టన్‌ విజయాన్ని అందుకుంటుంది. ఎలాగైనా గెలవాలని వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ మెక్‌ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్‌ అయిన బెర్ట్‌ వాన్స్‌కు ఇచ్చాడు.

బెర్ట్‌ వాన్స్‌ ఆ ఓవర్‌లో ఏకంగా 22 బంతులు వేసాడు. ఇందులో 17 నోబాల్స్ ఉండడం విశేషం. ఇన్ని నోబాల్స్ అనుకుంటే.. అంపైర్‌ ఒక బంతిని లెక్కించడంలో పొరపాటు పడ్డాడు. ఇక జర్మన్‌ ఎనిమిది సిక్సులు, ఐదు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్‌ సెంచరీ చేసాడు. జర్మన్‌ వీరబాదుడుతో కాంటర్‌బరీ విజయాన్ని చేరువైంది. కాంటర్‌బరీ చివరి ఓవర్‌లో 18 పరుగులు చేస్తే విజయం సాదిస్తుంది. జర్మన్‌ ఊపుచూస్తే.. కాంటర్‌బరీ సునాయాసంగా గెలిచేదిగా కనిపించింది. ఇవాన్‌ గ్రే వేసిన చివరి ఓవర్‌లో జర్మన్‌ 5 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక చివరి బంతికి ఒకే ఒక్క సింగిల్‌ తీస్తే.. కాంటర్‌బరీని విజయం వరిస్తుంది. చివరి బంతిని ఎదుర్కొన్న రోజర్‌ ఫోర్డ్‌ ఒక పరుగు కూడా తీయలేదు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. జర్మన్‌ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయింది. బెర్ట్‌ వాన్స్‌ ఒక ఓవర్లో 77 పరుగులు ఇచ్చి తన పేరుపై చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ.. ఈ చెత్త రికార్డు క్రికెట్ చరిత్ర రికార్డుల్లోకి ఎక్కలేదు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/