చిన్న గదిలో దాదాను చూసీ ఆశ్చర్యపోయాను

గంగూలీకి క్రికెట్ అంటే ఎంతో ప్రేమని వెల్లడి

VVS Laxman- Sourav Ganguly
VVS Laxman- Sourav Ganguly

కోల్‌కతా: భారత క్రికెట్లో సరికొత్త శకం ఆరంభమైంది. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గంగూలీ గురించి బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో బెంగాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి హోదాలో గంగూలీ ఓ చిన్న గదిలో పనిచేసుకుంటూ కనిపించాడని, ఆ సమయంలో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని లక్ష్మణ్ తెలిపారు.

భారత క్రికెట్లో ఎంతో విజయవంతమైన కెప్టెన్ గా అందరి మన్ననలు అందుకుని, విశేషమైన పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న గంగూలీ క్రికెట్ పై ప్రేమతో అంత ఇరుకు గదిలోనూ పనిచేయడం ఎంతో ఆకట్టుకుందని వెల్లడించారు. ఆ దృశ్యం ఇప్పటికీ తనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బెంగాల్ క్రికెట్ సంఘానికి దాదా చేసిన సేవలు చిరస్మరణీయం అని, బెంగాల్ క్రికెట్ కష్టకాలంలో ఉన్నప్పుడు దాదా పడిన కష్టం ఊరికే పోలేదని వివరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీని బెంగాల్ క్రికెట్ సంఘం ఘనంగా సత్కరించింది. కోల్ కతాలో జరిగిన ఈ కార్యక్రమానికి వీవీఎస్ లక్ష్మణ్, మహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు హాజరయ్యారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/