చైనా బెలూన్ల కలవరం..దేశ రక్షణ కోసం ఏం చేసేందుకైనా సిద్ధం: ప్రధాని రిషి

చైనా నిఘా బెలూన్లు తమనూ టార్గెట్ చేయవచ్చంటూ బ్రిటన్‌లో ఆందోళన

‘Whatever it takes’: UK PM Sunak vows to keep country safe amid Chinese spy balloon fears

లండన్‌: అమెరికాలో కలకలం రేపుతున్న చైనా నిఘా బెలూన్లు బ్రిటన్‌ను కూడా టార్గెట్ చేయవచ్చన్న వార్తల నడుమ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అమెరికా గగనతలంలో నాలుగో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చిన కొద్ది గంటలకే రిషి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ప్రజలకు చెబుతున్నదేంటంటే.. బ్రిటన్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం’’ అని రిషి సునాక్ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.

అమెరికా ఇప్పటివరకూ తన గగనతలంలో అనుమానాస్పదంగా ఉన్న నాలుగు వస్తువులను కూల్చేసింది. అయితే.. మొదట కూల్చేసిన బెలూన్ అత్యాధునికమైన నిఘా బెలూన్ అని, దాన్ని చైనాయే ప్రయోగించిందని ప్రకటించింది. భారత్‌ సహా పలు దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా పలు బెలూన్లు సిద్ధం చేసిందన్న కథనం ఒకటి ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఇక బ్రిటన్‌ గగనతలంలో అనుమానాస్పద వస్తువులను యుద్ధ విమానాలతో కూల్చేందుకు తాము సిద్ధమేనని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ‘‘అత్యవసర సమాయాల్లో వేగంగా స్పందించేందుకు క్విక్ యాక్షన్ రెన్సాన్స్ ఫోర్స్ సిద్ధం చేశాం’’ అని ఆయన చెప్పారు.