జాతీయ పార్టీ లో కేటీఆర్ కు..కేసీఆర్ ఏ స్థానం ఇవ్వబోతున్నారు..?

జాతీయ పార్టీ లో కేసీఆర్..తన కుమారుడు కేటీఆర్ కు ఏ స్థానం ఇవ్వబోతున్నారు..? ఇప్పుడే ఇదే హాట్ టాపిక్ అయ్యింది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. యావత్ దేశం మొత్తం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా దసరా రోజున కేసీఆర్ తన జాతీయ పార్టీ ని ప్రకటిస్తారని, లేదు లేదు అంతకంటే ముందే ప్రకటిస్తారని , మరికొంతమంది డిసెంబర్ లో ప్రకటిస్తారని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం దసరా రోజునే పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు.

దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్‌ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నది. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు మూహూర్తం నిర్ణయించగా.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయనున్నారు. అయితే జాతీయ పార్టీలో మంత్రి కేటీఆర్ కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది టీఆర్ఎస్‌లోను అలాగే దేశ వ్యాప్తంగాను చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీకి సంబంధించి కేసీఆర్ జాతీయ అధ్యక్షులుగా ఉంటారని, మంత్రి కేటీఆర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించి కేసీఆర్ జాతీయ అధ్యక్షుడిగా నేషనల్ పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్ ఆలోచన ఎలా ఉందనేది పార్టీ ప్రకటన రోజు తెలియజేస్తారు కావొచ్చు.

ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరును మాత్రమే మార్చి జాతీయ పార్టీగా ప్రకటిస్తానంటూ కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో వెల్లడించారు. పార్టీ గుర్తు మాత్రం అలాగే ఉంటుందని, పార్టీ పేరు మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. గులాజీ జెండా కూడా అలాగే ఉంటుందని, మధ్యలో తెలంగాణకు బదులు భారతదేశ పటం ఉంటుందని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పార్టీ పేరుతో పాటు గుర్తు, జెండాపై క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.