తమ మౌనాన్ని బలహీనంగా భావించొద్దు

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ..సీఎం కేసీఆర్‌పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించి స్వరాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు మీడియా, మనీ, మజిల్‌ పవర్‌ లేదని.. కొందరు నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణ సాధనలో విజయం సాధించారని పేర్కొన్నారు.


ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ది సీఎంలను ఉరికించిన చరిత్ర అని తమ మౌనాన్ని బలహీనంగా భావించొద్దన్నారు. గోడకు వేలాడదీసే తుపాకీ సైతం మౌనంగానే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుందని ప్రతిపక్షాలకు చురకలంటించారు. కేసీఆర్‌ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో యావత్‌ తెలంగాణకు తెలుసన్నారు. ఏప్రిల్‌ 27 నాటికి టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 2 దశాబ్దాలని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో నిలిచిందని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/