విజయవాడలో బీజేపీ మాకు సపోర్ట్ చేయలేదు..జనసేన నేత పోతినేని

బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం, ఎస్సీ, ఎస్టీలు దూరమయ్యారు

విజయవాడ: బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జనసేనకు పెద్ద మైనస్ పాయింట్ అని ఆ పార్టీ నేత పోతినేని మహేశ్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అన్ని చోట్ల జనసేనకు ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు దూరమయ్యారని అన్నారు. ఆ కారణం వల్లే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయామని చెప్పారు. విజయవాడలో బీజేపీ తమకు అండగా నిలబడలేదని విమర్శించారు.

ఇదే సమయంలో అమరావతి పరిరక్షణ సమితిపై కూడా ఆయన మండిపడ్డారు. రాజధానిగా అమరావతే ఉండాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయని… అలాంటప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఎన్నికలను అమరావతి పరిరక్షణ సమితి ఎందుకు సీరియస్ గా తీసుకోలేదని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ సమితి కేవలం ఫొటో ఉద్యమాలు మాత్రమే చేస్తోందా? అని మండిపడ్డారు. అమరావతిని వ్యతిరేకిస్తున్న వాళ్లకు ఓటు వేయొద్దని ఎందుకు పిలుపునివ్వలేదని దుయ్యబట్టారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/