వెల్సావోలో స్థానిక మ‌త్స్య‌కారుల‌తో రాహుల్‌ సమావేశం

ప‌నాజీ: వ‌చ్చే ఏడాది ప్రారంభంలో గోవా అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ గోవా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. వెల్సావోలో స్థానిక మ‌త్స్య‌కారుల‌తో సమావేశ‌మైన ఆయ‌న‌.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే స‌మస్య‌లు తీరుస్తుంద‌ని చెప్పారు. తాము ఛ‌త్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేశాం. గెలిపిస్తే వ్య‌వ‌సాయ రుణాలు మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చాం. మ్యానిఫెస్టోలో చేర్చాం. గెలిచాం.. వ్య‌వసాయ రుణాలు మాఫీ చేశాం. ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాత్ర‌మే కాదు.. మీరు కావాల‌నుకుంటే గోవా, పంజాబ్ రాష్ట్రాల‌కు కూడా వెళ్లి తాము మ్యానిఫెస్టోలో చేర్చిన హామీల‌ను నెర‌వేర్చామో లేదో తెలుసుకోవ‌చ్చు. మేం ఏదైనా మ్యానిఫెస్టోలో చేర్చామంటే అది గ్యారంటీ.. కేవ‌లం హామీ కాదు అని రాహుల్‌గాంధీ చెప్పారు.

తాము గోవాను క‌లుషిత ప్రాంతం కానివ్వ‌బోమ‌ని, బొగ్గు అడ్డాగా మార‌నివ్వ‌మ‌ని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హ‌యాంలో అంత‌ర్జాతీయంగా బ్యారెల్ చ‌మురు ధ‌ర 140 అమెరిక‌న్ డాల‌ర్‌లు ఉండేద‌ని, అయినా చ‌మురు ఉత్ప‌త్తులపై పెద్ద‌గా ప‌న్నుల విధించ‌లేద‌ని, త‌క్కువ ధ‌ర‌కే చ‌మురు అందేద‌ని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్ర‌స్తుతం క్రూడాయిల్ ధ‌ర‌లు బాగా త‌గ్గాయ‌ని, అయినా ప్ర‌భుత్వం అధిక ప‌న్నులు విధించ‌డంతో ధ‌ర‌లు భారీగా పెరిగాయ‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఇంధ‌నంపై అత్య‌ధిక ప‌న్నులు వ‌సూలు చేస్తున్న దేశం భార‌త్ మాత్ర‌మేన‌ని రాహుల్ విమ‌ర్శించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/