ఆటుపోట్లున్నా ..ముందుకు పయనం

21వ శతాబ్దం మహిళల అభివృద్ధిని ఆకాంక్షించే శతాబ్దంగా భావించవచ్చు. ఈ సృష్టిలో ‘స్త్రీ పుట్టుక లేకపోతే సృష్టి మనుగడ లేదనేది నగ్నసత్యం. ప్రతి సంవత్సరం మార్చి-8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి.

Women

ప్రపంచ మహిళా దినోత్సవానికి మొదటగా బీజం పడింది మాత్రం అగ్రరాజ్యమైన అమెరికా దేశంలో 1857 సంవత్సరంలో మార్చి 8న మహిళా కార్మికులు తాము పనిచేస్తున్న బట్టల ఫ్యాక్టరీలో పని గంటలు 16 గంటల నుంచి 10 గంటలకు తగ్గించాలని మొదటగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తరువాత వివిధ సమావేశాలు 1910లో డెన్మార్క్‌లోని కొపెన్‌హగ్‌లో 2వ సదస్సు జరిగింది. ఐక్యరాజ్యసమితి (యుఎన్‌ఒ) 1975 నుండి ప్రతియేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తారీఖున నిర్వహించాలని నిర్ణయించింది.

అయితే నిజంగా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారా? అంటే సమాజం తనను తాను ప్రశ్నించుకొని ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉంటుంది. నాణానికి బొమ్మ బోరుసు మాదిరిగా ఇంకా కొన్ని దేశాలలో స్త్రీలకు తగినంత ప్రాతినిధ్యం లభించడం లేదనేది అంగీకరించాల్సిన సత్యం. నిజంగా స్త్రీలకు అన్నిరంగాలలో ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయా? అంటే లేదనే చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా దేశాలలో స్త్రీలు కుటుంబానికే పరిమితమై బాహ్యప్రపంచ విషయాలతో సంబంధం లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు నేటికి కొన్ని సాంప్రదాయక పద్ధతులు పాటిస్తున్న దేశాలలో స్త్రీలు పుట్‌బాల్‌, క్రికెట్‌ మ్యాచ్‌లను స్టేడియంలోకి వచ్చి వీక్షించడం నేరంగా భావిస్తున్నారు. ఒలింపిక్స్‌లో కొన్ని దేశాల తరపున క్రీడలలో స్త్రీలు పాల్గొనడం కనిపించదు.

భారత రాజకీయరంగంలో విచిత్ర పరిస్థితులను గమనించవచ్చు. గ్రామాలలో, పట్టణాలలో సర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా మహిళలు గెలిచినా ఆ మహిళల స్థానంలో భర్త, అన్న, తమ్ముడు మరిది లేదా బంధువ్ఞలు పెత్తనం, అధికారం చెలాయించడం, ఆమెకు కేటాయించిన కుర్చీలో వారు కూర్చోవడం గమనించవచ్చు. ఇక భారత రక్షణరంగ విషయానికి వస్తే రక్షణ రంగంలో ఒకపుడు స్త్రీలకు దాదాపు ప్రవేశం లేదనే చెప్పాలి. మహిళలు శారీరకంగా బలహీనులని వారికి అవకాశాలు కల్పించలేదు. అయితే ఒక్కసారి దేశచరిత్రను తిరగేస్తే స్త్రీ రణరంగంలో తాము తక్కువేమి కాదని శౌర్యపరాక్రమాలను ప్రదర్శించిన మాంచాల మల్లమ్మ, రాణిచెన్నమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి, రాణిరుద్రమాదేవి, హజరత్‌బేగం మొదలైనవారిని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.

1950లో సైనిక చట్టం ద్వారా సైన్యంలో పరిమితంగా మహిళల సేవలు నివినియోగించుకొనవచ్చునని చెప్పినా అది కార్యరూపం దాల్చడానికి మరొక 42 సంవత్సరాల కాలం పట్టింది. 1992లో తొలిసారిగా మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన అది కాంట్రాక్టు నియమాలకే పరిమితమైంది. 2006 నాటికి స్వల్పకాల సేవల్లో రక్షణరంగంలో మహిళలను నియమించడం జరిగింది. జర్మనీ, నార్వే, అమెరికా దేశాలలో మహిళలను యుద్ధాల్లో భాగస్వాముల్ని చేస్తూ నారీమణుల సేవలను వినియోగించుకుంటున్నారు. భారతదేశ మహిళల భద్రతను పరిశీలిస్తే వారి భద్రతపై ఆందోళన కలుగకమానదు. దేశంలో స్త్రీలు వివిధ రకాల దొపిడికి, అణిచివేతకు, అత్యాచారాలకు, ఆత్మహత్యలకు, హత్యలకు, శారీరక దాడులకు, మానసిక దాడులకు, లైంగిక దాడులకు గురవ్ఞతూనే ఉన్నారు. దేశరాజధాని ఢిల్లీలో 2012 డిసెంబరులో జరిగిన ‘నిర్భయ సంఘటన యావత్‌ భారతావనని కదిలించింది. తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 2019 నవంబరు 27న జరిగిన ‘దిశ ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది.

ఈ ఘటనకు వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘దిశ పేరుతో చట్టాన్ని ప్రవేశపెట్టి బిల్లును అసెంబ్లీలో ఆమోదముద్ర వేసుకుంది. నిర్భయ చట్టం చేసిన తరువాత కూడా స్త్రీలపై అఘాయిత్యాలు తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. 2012-2017 సంవత్సరం మధ్యకాలంలో దేశంలో రెండు లక్షల పదిహేను వేలకుపైగా అత్యాచారాలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దేశంలోనే మహిళలపై అకృత్యాల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొదటిస్థానంలో నిలువగా నాగాలాండ్‌ తక్కువ రేటుతో చివరిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 67 అత్యాచారాలు ప్రతి గంటకు ముగ్గురు మహిళలు అత్యాచారాల బారిన పడుతున్నారు.

భారత రాజ్యాంగ పీఠిక లింగ సమానత్వ భావనకు పట్టం కట్టిన సంబంధిత సూచిలో మొత్తం 129 దేశాల జాబితాలో భారత్‌కు 95వ స్థానం లభించడం ఆందోళన కలిగించే విషయం. అభివృద్ధి క్రమంలో భాగంగా భాగస్వామ్యం, న్యాయం, భద్రత మూడు అంశాలను ప్రాతిపదికగా చేసుకొని మహిళలకు చేదోడువాదోడుగా ఉండటంలో ఇండియా 167 దేశాలలో 133వ స్థానం లభించింది. లింగ సమానత్వవిషయంలో దేశంలో నిర్వహించిన సర్వేలో 37 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి (యుఎన్‌ఒ) సెక్రటరీ జనరల్‌ ఆంటోనీ మాట్లాడుతూ మహిళలు, ఆడపిల్లలపై అటవిక హింసకు మూలకారణాలు దశాబ్దాలుగా సాగుతున్న పురుషాధిక్య భావజాలంలో ఉన్నామనే విషయాన్ని వివరించారు.

ప్రస్తుత రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖలు నేటి ప్రభుత్వాలు చట్టాల సవరణకు సంసిద్ధమంటున్న నిందితులకు కఠినశిక్షలు పడేలా చూస్తామని చెబుతారు. అయితే దీనికి కావల్సింది రాజకీయ సంకల్పమే తప్ప కొత్త బిల్లులు కాదు. అనే ప్రకటన సమాజాన్ని ఆలోచింపచేస్తుంది.
స్త్రీలు కేవలం సంతానోత్పత్తి యంత్రాలుగా చూసే దృక్పధం మారాలి. భారతదేశంలో భర్త మరణించిన స్ల్రీ పరిస్థితి అరణ్యరోదనను తలపిస్తాయి.

మానసికంగా మరణించి శారీరకంగా బతికి ఉంటుంది. పూర్తి స్వేచ్ఛను కోల్పోయి, పిల్లల పెంపక బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకొని వారి అభ్యున్నతికి నిరంతరం సమాజంలో శ్రమిస్తూనే ఉంటుంది. ఆ స్త్రీ రెండో వివాహం చేసుకుంటే సమాజం సూటిపోటి మాటలను భరించడం, సమాజ దృక్పధం భరించడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాలలో మరొక దురాచారం జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, మతాంగి వ్యవస్థగా పిలువబడుతుంది. ఈ ఆచారం ప్రకారం చిన్న వయసులోనే అమ్మాయిని దేవ్ఞని పేరుమీద వదిలి, ఆ స్త్రీకి వివాహం ఉండక గ్రామంలోని ప్రతి పురుషునికి శారీరక సంబంధం నెరవేర్చవలసి ఉంటుంది.

ఆ స్త్రీకి జన్మించిన పిల్లలకు తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఆ స్త్రీ ఉంటుంది. ఉభయతెలుగు రాష్ట్రాలలో ఈ సాంఘిక దురాచారం ఇంకా కొనసాగుతున్నదంటే ఆశ్చర్యం కలుగక మానదు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ సాంఘిక దురాచారాలు ప్రత్యక్షమౌతున్నాయి. వీటికి ప్రధాన కారణం పేదరికం, నిరక్షరాస్యత, సాంఘిక అసమానతలేనని చెప్పవచ్చు. నింగిలోకి రాకెట్లను పంపి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడ్డామని గొప్పలు చెప్పుకుంటున్నా ఇంకా స్త్రీలపై పూర్వకాలపు సాంఘిక దురాచారాలు వెంటాడుతూ వాటి వాసనలు మన సమాజంపై నడిపిస్తున్నాయా? అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి.

మహిళలపై అఘాయిత్యాలు నిరోధానికి ఇండియన్‌ పీనల్‌కోడ్‌ (ఐపిసి) ఎన్నో చట్టాలను చేసింది. పిల్లలపై లైంగిక దాడులను అరికట్టడానికి బాలల రక్షణ చట్టం ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్యువల్‌ ఆఫెన్స్‌ (పిఒసిఎస్‌ఒ) యాక్ట్‌-2012, గృహహింస నిరోధక చట్టం (2005), బాల్యవివాహాల నిషేధచట్టం (1961), నిర్భయ చట్టం (2013), ఆంధ్రప్రదేశ్‌లో దిశచట్టం (2019)లు ఏర్పాటు చేయబడ్డాయి. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు దేశ రాజధానిలో 1091 టోల్‌ఫ్రీ, ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌మిత్ర పేరుతో వాట్సప్‌ నెంబరు 9121211100కు ఫిర్యాదు చేయవచ్చు.

100,112 రెండు టోల్‌ఫ్రీ నెంబరుకు సంబంధించి దిశ కంట్రోల్‌ రూమ్‌గా పిలువబడుతున్నాయి. పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు 1098 హెల్ఫ్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మహిళల సమస్యలపై పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘సఖీ సెంటర్లు ఏర్పాటు చేశారు. మహిళల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంఓఏమ కార్యక్రమాలను, పధకాలను ప్రవేశపెట్టాయి. స్త్రీలకు చట్టాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నా చాలామందికి చట్టపరంగా తమకున్న హక్కులపై సంక్షేమ పధకాలపై అవగాహన ఉండకపోవడంతో ఎంతోమంది స్త్రీలు రకరకాల హింసలకు గురవ్ఞతున్నారు.

పధకాల లబ్ది పొందు టలో వెనుకబడి పోతూ హింసను మౌనం గా భరిస్తూ వస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌, నెదర్లాం డ్స్‌ దేశాలు తమ దేశపు మహిళ లు భారత్‌లో పర్యటించే సమయంలోత గు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తుండ టం భారత ప్రతిష్ఠకు మచ్చగా భావించాలి. – ఎం.గీత

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/