ఈనెల 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

ముగిసిన క్యాబినెట్‌ భేటి..తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కేసులు..ఆగస్ట్ కల్లా వ్యాక్సిన్ రావొచ్చన్న సిఎం కెసిఆర్‌

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ఈసమావేశం కొనసాగింది. అనంతరం సిఎం కెసిఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. కాగా ఈరోజు కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని వెల్లడించారు.

ఆగస్ట్ సమయానికి వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కెసిఆర్‌ వివరించారు. భారత్ బయోటెక్, బీఈ, శాంతాబయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలు సాగిస్తున్నాయని తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకు 628 కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా ప్రభావిత ప్రాంతాలను రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ గా, కరోనా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా విభజించారని తెలిపారు. తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయని, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చెల్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాలు రెడ్ జోన్ కింద ఉన్నాయని వివరించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/